జెనీవా : కరోనా వైరస్ వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుందన్న ప్రచారాలు పూర్తి అవాస్తవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. సమర్థవంతమైన టీకాల వలన మాత్రమే కరోనా మరణాలు, ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ సోమవారం స్పష్టం చేశారు. వైరస్ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నదనీ, అయితే మార్పులు చెందుతున్న వైరస్ మరింత ప్రమాదకారిగా మారే అవకాశమున్నదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కోవిడ్ మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలూ సమిష్టిగా కృషి చేయాలని కోరింది.