Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు గంటల పాటు సాగిన చర్చలు
జెనీవా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ బుధవారం నాడిక్కడ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. బైడెన్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తరువాత ఈ ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. దాదాపు అయిదు గంటల పాటు సాగిన ఈ ద్వైపాక్షిక చర్చల్లో మధ్య ప్రాచ్యం, సిరియా, లిబియా, ఇరాన్ అణు కార్యక్రమం, కొరియా ద్వీపకల్పం, నాగర్నో కరాబక్, ఉక్రెయిన్ తదితర అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలోని 18వ శతాబ్ది నాటి చారిత్రిక విల్లా లా గ్రాంగే ఈ ఇరువురు నేతల మధ్య శిఖరాగ్ర భేటీకి వేదికైంది. చర్చలు రెండు దొంతరలుగా జరిగాయి. మొదట బైడెన్, పుతిన్, ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, ఆంటోని బ్లింకెన్, అనువాదం చేసే దుబాసీలకు మాత్రమే పరిమితంగా తొలి దఫా చర్యలు సాగించారు. ఇవి అత్యంత గోప్యంగా జరిగాయి. రెండో దశలో ఇరుదేశాల ప్రతినిధి బృందాలతో కలసి బహిరంగ చర్చలు నిర్వహించారు. అమెరికా గత కొన్ని నెలలుగా రష్యాకు వ్యతిరేకంగా ప్రచార దాడి చేస్తున్నది. రష్యా కూడా దీనికి దీటుగానే బదులిస్తున్నది. రష్యన్ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని వేధిస్తున్నారని అమెరికా ఆరోపిస్తున్నది.జనవరి6న కేపిటల్ హిల్ (అమెరికన్పార్లమెంటు భవనం)పై మూక దాడితో ఆధునిక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హతను అమెరికా కోల్పోయిందని పుతిన్ ఎదురు దాడి చేశారు. ప్రపంచాన్ని శాసించే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని రష్యా సూటిగా ప్రశ్నిస్తున్నది. అమెరికా ఆధిపత్యాన్ని పుతిన్ బాహాటంగానే సవాల్ చేస్తున్నారు. బుధవారం నాటి చర్చల్లో అంగీకార అంశాల కన్నా, అనంగీకార అంశాలే ఎక్కువ ఉన్నాయి. అమెరికా, రష్యా అధినేతల మధ్య చర్చలు చివరి సారి 2019లో హెల్సింకీలో జరిగాయి. ట్రంప్, పుతిన్ పాల్గొన్న ఆ చర్చలు విఫలమయ్యాయి.