Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అంతర్జాతీయ అంశాలపై పురోగతి :పుతిన్
మాస్కో : స్విట్జర్లాండ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో బుధవారం నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో పలు అంతర్జాతీయ రాజకీయ అంశాలపై పురోగతి సాధించినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో నెలల తరబడి దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ఇరు దేశాల రాయబారులు తిరిగి వారి పదవుల్లో నియమితులు కానున్నారా అని ప్రశ్నించగా, ఈ మేరకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. బహుశా ఈ వారంలోనే వారు నియమితులు కావచ్చని పుతిన్ చెప్పారు. దేశీయ రాజకీయాలకు సంబంధించి ప్రధానమైన ప్రశ్నలేవీ ఈ చర్చల్లో తలెత్తలేదని పుతిన్ చెప్పారు. ఎలాంటి ఘర్షణలు నెలకొన్నాయని కూడా తాను భావించడం లేదన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారంపై కీలకమైన చర్చలు జరిగాయని చెప్పారు. బైడెన్ మంచి రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడని, చాలా అనుభవం వున్నవారని పుతిన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క నేతతోనూ ఇంత సుదీర్ఘంగా చర్చలు జరపలేమని పేర్కొన్నారు. ఆన్లైన్ గూఢచర్యానికి అమెరికా స్వంత బాధ్యతపై అడిగిన పలు ప్రశ్నలకు పుతిన్ సమాధానమివ్వలేదు. వాటిపై కసరత్తు చేయాల్సి వుందని మాత్రమే అన్నారు. ఉక్రెయిన్‌పై వాడిగా వేడిగా చర్చ జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఘర్షణను నివారించడానికి ముందుగా కుదిరిన మిన్స్క్ ఒప్పందాల అమలుపైనే తమ దృష్టి వుందని పుతిన్ చెప్పారు. అమెరికా మాదిరిగా సుదూరంగా ఆ దేశ సరిహద్దుల్లో మిలటరీ హార్డ్‌వేర్‌ను మోహరించలేమని పుతిన్ పేర్కొన్నారు. వాషింగ్టన్ విధానం భిన్నంగా వుంటుందని, రష్యా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిందని, దీనివల్ల ఆ ప్రాంతంలో ఉద్రికత్తలు చెలరేగడానికి దారి తీసిందన్నారు. దేశీయంగా నెలకొన్న వ్యతిరేకతపై అణచివేత చర్యలను నిలుపుచేయాలనుకుంటున్నారా లేదా అని ఒక విలేకరి ప్రశ్నించారు. పెరోల్ నిబంధనలను అలెక్స్ నావల్నీ ఉల్లంఘించారని, దేశానికి తిరిగి వచ్చిన వెంటనే అరెస్టవుతారని చెప్పారు.
చర్చలపై అంగీకారం
అణ్వాయుధాలను పరిమితం చేస్తూ ఇరు దేశాల మధ్య మిగిలిన చివరి ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించడానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. సమావేశం సమర్ధవంతంగా, గణనీయంగా, నిర్దిష్టంగా జరిగిందని పుతిన్ వ్యాఖ్యానించారు.