Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటరీ ఉప ఎన్నికలో కన్జర్వేటివ్ అభ్యర్థి ఓటమి
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తన సొంత నియోజకవర్గానికి కొద్ది మైళ్ల దూరంలోని అంటే లండన్ శివార్లలోని పార్లమెంటరీ సీటుకు తాజాగా జరిగిన ఉప ఎన్నికలో పాలక కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. 1974 నుంచి చెషామ్ అమర్షామ్ నియోజకవర్గంలో కన్జర్వేటివ్లే ఎప్పుడూ గెలుస్తూ వచ్చారు. ప్రతి సారి 50శాతానికి పైగా ఓట్లు వచ్చేవి. ఈసారి అనూహ్యమైన రీతిలో లిబరల్ డెమోక్రాట్ అభ్యర్ధి, యురోపియన్ యూనియన్ పార్టీ అనుకూల వ్యక్తి విజయం సాధించారు. శుక్రవారం ఉదయం ప్రకటించిన ఫలితాల్లో కన్జర్వేటివ్ అభ్యర్ధిపై 8,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితం చాలా నిరాశాజనకంగాను, కఠినంగాను వుందని జూనియర్ హోం మంత్రి కిట్ మాల్తాస్ వ్యాఖ్యానించారు. ఈశాన్య ఇంగ్లండ్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీకి గట్టి పట్టు వున్న హర్తేల్పూల్లో గత నెల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ తమను పట్టించుకోవడం లేదని చాలామంది ఓటర్లు భావిస్తున్నారని, ముఖ్యంగా జాన్సన్ పట్ల వారు చాలా అసంతృప్తిగా వున్నారని లిబరల్ డెమొక్రాట్ నేత ఎడ్ డేవీ వ్యాఖ్యానించారు.