Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు సంకేతాలిచ్చిన కిమ్
ప్యాంగాంగ్ : చర్చలకైనా, ఘర్షణకైనా ఈ రెండింటిలో దేనికైనా సిద్ధమేనని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు సంకేతాలిచ్చారు. కొత్తగా వచ్చిన బైడెన్ ప్రభుత్వం పట్ల కిమ్ తన వైఖరిని వెల్లడిస్తూ ఈ ప్రకటన చేశారని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కెసిఎన్ఎ పేర్కొంది. పాలక వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో బైడెన్ ప్రభుత్వంపై కిమ్ వివరణాత్మక విశ్లేషణ చేశారు. రాబోయే రోజుల్లో అమెరికాతో కొనసాగించే సంబంధాలకు దిశా నిర్దేశం చేశారు. సముచితమైన వ్యూహాత్మక రీతులు, ఎత్తుగడలతో కూడిన ప్రతిచర్యలు అనుసరించాల్సి వుందని సీనియర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన బైడెన్ ప్రభుత్వంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. చర్చలు, ఘర్షణలు రెండింటికీ సిద్ధంగా వుండాల్సిన అవసరాన్ని కిమ్ నొక్కి చెప్పారు. ముఖ్యంగా మన దేశ పరువు ప్రతిష్టలను కాపాడుకోవడానికి గానూ ఘర్షణకే పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సి వుంటుందన్నారు. అయితే కిమ్ కచ్చితంగా పేర్కొన్న విధానాల వివరాలను కెసిఎన్ఎ వెల్లడించలేదు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య దశాబ్దాల తరబడి ఘర్షణాయుత సంబంధాలు నెలకొన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆ పరిస్థితి మారేలా కనిపించడం లేదు. ఇరు పక్షాలు కూడా వేచి వుండే ధోరణినే అవలంబించినట్లు కనిపిస్తోంది. ఉత్తర కొరియాతో ఏదో ఒక రూపంలో దౌత్యాన్ని కొనసాగించేందుకు బైడెన్ సర్కార్ కూడా అంత స్పష్టంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అమెరికా ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పుల్లో ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని కూడా బైడెన్ చేర్చారు. దీనిపై కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.