Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలోనూ 212 శాతం పెరిగి.. 20,700 కోట్లకు...
- 13 ఏండ్లలో అత్యధికం : స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదిక
నల్లధనం సరిహద్దులు దాటకుండా అడ్డుకట్టవేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ అందులో పూర్తిగా విఫలమయ్యారు. కరోనా కాలంలో స్విస్ బ్యాంకులో భారతీయుల సంపద 212శాతానికి ఎగబాకింది. ఇది 13 ఏండ్లలోనే అత్యధికమని స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదికలో ప్రకటించింది. దీన్నిబట్టి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో భారీగా సంపద స్విస్బ్యాంకుకు చేరినట్టు అర్థమవుతుంది. 2019తో పోల్చితే 3.12 రెట్లు ఎక్కువగా నమోదైనట్టు నివేదికలో ధ్రువీకరించింది.
జ్యూరిచ్ : విదేశీబ్యాంకుల్లో చోరీ, లూటీ చేసి పెద్దలు దోచుకున్న సంపదను తెస్తానంటూ మోడీ దేశ ప్రజలకు గాలం వేశారు. ఓట్లు పడ్డాక..ఏడేండ్లు పూర్తయినా ఇంతవరకూ జనం ఖాతాల్లో ఒక్కపైసా పడలేదు. పైగా బ్యాంకులను కొల్లగొట్టిన మెహల్ చోక్సి, నీరవ్‌మోడీ, విజరు మాల్యా లాంటి పెద్దలంతా బీజేపీ హయాంలోనే విదేశాలకు చెక్కేశారు. ఇది నాణానికి ఒక వైపు. మరోవైపు భారత్‌లో కరోనా ఎంతలా విరుచుకుపడిందో.. ఏవిధంగా దేశాన్ని ఛిన్నాభిన్నం చేసిందో ప్రతిఒక్కరికి తెలుసు. దేశాన్ని ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. కరోనా కాలంలో నల్లధనం హద్దులు దాటింది. 2020 నాటికి స్విస్ బ్యాంకులో భారతీయుల సంపద 20,700 కోట్లకు చేరింది. ఈ సంపదలో దేశంలో ఉన్న బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా చేసిన డిపాజిట్లూ ఉన్నాయి. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడానికి కారణం సెక్యూరిటీలు, ఇతర మార్గాల ద్వారా హౌల్డింగ్స్ బాగా పెరగడం గమనించదగ్గ విషయం. కానీ ఖాతాదారుల డిపాజిట్లు మాత్రం వరుసగా రెండోసారి తగ్గాయని నివేదికలో వెల్లడించింది.
డేటాలో ఏమున్నదంటే...?
స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) గణాంకాల ప్రకారం 2006.. భారతీయుల డిపాజిట్లు ఆల్ టైం గరిష్టంగా రూ. 52,575 కోట్లు ఉన్నాయి. అప్పటినుంచి 2011, 2013, 2017 సంవత్సరాల్లో మినహా చాలావరకు క్షీణత కనిపించింది.
అగ్రస్థానంలో యూకే
2020 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.161.78 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వీటిలో విదేశీ డిపాజిట్లు రూ.48.53 లక్షల కోట్లు. ఈ జాబితాలో యూకే మొదటి స్థానంలో ఉన్నది (30.49 లక్షల కోట్లు.) 12.29 లక్షల కోట్లతో అమెరికా రెండవస్థానంలో ఉన్నది.
ఈ దేశాలే కాకుండా.. వెస్టిండీస్, ఫ్రాన్స్, హాంకాంగ్, జర్మనీ, సింగపూర్, లక్సెంబర్గ్, కేమాన్ దీవులు , బహమాస్ దేశాలు టాప్ 10 ఉన్నాయి. ఈ దేశాల నుంచి భారత్ నుంచి మనీలాండరింగ్ రూపంలో అడ్డదారిన పన్నలు చెల్లించని నల్లధనం స్విస్బ్యాంకుకు చేరుతున్నది. స్విస్ బ్యాంకులో అక్రమార్కుల వివరాలన్నీ మోడీ ప్రభుత్వం వద్ద ఉన్నా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నల్లధనాన్ని అడ్డుకోవటానికే పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు బీజేపీ సర్కార్ చెప్పుకున్నా.. బ్లాక్‌మనీ బుసలు కొడుతున్నట్టు అనేక అధ్యయనాలు తేల్చాయి. ఈ విషయాన్ని కేంద్రబ్యాంక్ కూడా అంగీకరించింది. ఇక రాజకీయపార్టీలకు వచ్చే విరాళాల గురించి ఆర్టీఐ దాఖలు చేసే అవకాశంలేకుండా చేసేసింది మోడీ సర్కార్. ఇపుడు అత్యధికంగా విరాళాలు(నల్లధనాన్ని) బీజేపీకే అందుతున్నాయి. కార్పొరేట్లు అక్రమమార్గంలో స్విస్‌కు తరలించుకునేందుకు బీజేపీని ప్రసన్నం చేసుకుంటున్నట్టు తాజా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి.
ఇక పెద్ద మనుషులు కోట్లు దోపిడీకి పాల్పడి స్విస్ బ్యాంకులకు తమ సంపదను తరలిస్తున్నారు. ఈ పెద్దమనుషులు పన్నులు కట్టకపోయినా కట్టినపుడు తీసుకుందామనుకున్న తీరులో కేంద్రం ఉన్నది. పన్నుల భారాలు, పెట్రో ,ఇంధన ధరలను పెంచేస్తున్నా.. సామాన్య,మధ్యతరగతి ప్రజలు మాత్రం మా తలరాతలు మారవా.! అంటూ లోలోన బాధల్ని దిగమింగుకుంటున్నారు.
ప్రధాని అభ్యర్థి మోడీ అన్నదేంటీ..!
నల్లధనం ఎలా తెస్తారని నన్ను అడుగుతున్నారు. ఒక్కసారి అధికారమివ్వండి.. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న ఆ డబ్బు తెస్తాం. పెద్దలు పోగేసుకున్న ఆ ధనం పేదలదీ.. రైతులదీ. ఆ సంపద అంతా వారికే చెందాలి. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తాం అన్నారు. ఈ ఏడేండ్లలో ఏం జరిగింది..? దేశ ప్రజల ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?