Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్‌టౌన్: ఆఫ్రికన్ విమోచనా పోరాట యోధుడు, స్వతంత్ర జాంబియా వ్యవస్థాపక అధ్యక్షుడు కెనెత్ కౌండా (97) మృతి పట్ల దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ (ఎస్ఎసిపి) ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, జాంబియా ప్రజలకు తన సానుభూతి తెలియజేసింది. ఆఫ్రికన్ విమోచనా యోధుల్లో అత్యంత ముఖ్యుల్లో కెనెత్ కౌండా ఒకరు. యూరోపియన్ వలసపాలన నుంచి ఆఫ్రికన్ ప్రజలకు విముక్తి కల్పించేందుకు వివిధ ఆఫ్రికన్ విప్లవకారులను ఆయన కూడదీశారు. వారు చేసిన అపారమైన త్యాగాల వల్లే ఈ విమోచన సాధ్యమైంది అని ఎస్ఎసిపి కౌండా సేవలను కొనియాడింది. దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజలపై శ్వేత దుర్హంకార ప్రభుత్వం, సామ్రాజ్యవాద శక్తులు తీవ్రమైన దాడులకు పాల్పడినప్పుడు దానికి వ్యతిరేకంగా సాగిన పోరుకు కౌండా గట్టి మద్దతునిచ్చారు. జాంబియా ఆ సమయంలో ఇబ్బందులెదుర్కొంటున్నప్పటికీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు వస్తు రూపేణా అవసరమైన సాయాన్ని కూడా అందించారని ఎస్ఎసిపి పేర్కొంది. న్యుమోనియాతో గత సోమవారం నాడు లుసాకాలోని ఆసుపత్రిలో చేరిన కెనెత్ కౌండా (97) గురువారం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలియగానే అధ్యక్షుడు ఎడ్గార్ లుంగు, వివిధ దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. కౌండా గౌరవార్థం జాంబియా ప్రభుత్వం 21 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.