Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త మ్యూటెంట్ల నేపథ్యంలో నిపుణుల ఆందోళన టీకాల వేయడం..
- కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ సూచన
బ్రెజిల్: కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ భౌతికదూరం సహా పలు కరోనా మర్గదర్శకాలను అమలు చేయకపోవడం, టీకాలు సైతం ప్రజలకు అందించడంలో అలసత్వం కారణంగా బ్రెజిల్ కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితులపై వైద్యారోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్లో 11 శాతం మందికి మాత్రమే కరోనా టీకాలు అందించారు. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరింత ప్రభావం చూపుతోంది. మొత్తంగా బ్రెజిల్లో 1,78,83,750 కరోనా కేసులు, 500,800 మరణాలు నమోదయ్యాయి. అమెరికా తర్వాత అత్యధికంగా బ్రెజిల్లోనే కరోనా మరణాలు సంభవించాయి. సగటున నిత్యం 2 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ''టీకా ప్రభావాలను చూడటానికి ముందే మేము ఏడు లక్షలు లేదా ఏనిమిది లక్షల మరణాలకు చేరుకోబోతున్నామని నేను భావిస్తున్నాను'' అంటూ బ్రెజిల్ మాజీ హెల్త్ రెగ్యులేటర్ గొంజాలో వెసినా అన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకురావడం సహా అత్యంత ప్రమాదకరమైన ఇండియన్ వేరియంట్ కేసులు తమ దేశంలో వెలుగు చూస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే దేశ అధ్యక్షుడు బోల్సోనారోపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కరోనాపై సమన్వయ జాతీయ ప్రతిస్పందన లేకపోవడంతో పాటు టీకాల కొరత, లాక్డౌన్ సహా భౌతికదూరం పాటించాలనే కరోనా మార్గదర్శకాలను అమలు చేయలేకపోయారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్లో శనివారం ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. బోల్సోనారోకు వ్యతిరేకంగా నినదించారు. ఆయనను తొలగించాలంటూ పిలుపునిచ్చారు. బ్రెజిలియన్ బయోమెడికల్ సెంటర్ ఫియోక్రజ్ పరిశోధకుడు రాఫెల్ గుయిమారెస్ మాట్లాడుతూ.. లాటిన్ అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో టీకా కార్యక్రమంలో ఆలస్యం అంటే దాని పూర్తి ప్రభావాలు సెప్టెంబర్ లేదా ఆపైనా కూడా కొనసాగగలవు. నిత్యం మూడు వేల కంటే అధికంగా మరణాలు సంభవించవచ్చునని అన్నారు. దేశం ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, కరోనా వ్యాప్తి అధికమవుతున్నదనీ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు సహా ఇతర సౌకర్యాలు పెంచాల్సిన అవసరముందన్నారు. సావోపాలో విశ్వవిద్యాలయంలోని ఎపిడెమియాలజిస్ట్ ఈస్టర్ సబినో మాట్లాడుతూ.. టీకాల వేగాన్ని త్వరితగతిన పెంచాలన్నారు. లేకుంటే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయని హెచ్చారించారు.