Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ ప్రధాని వ్యాఖ్య
ఇస్లామాబాద్ : కాశ్మీర్ సమస్య పరిష్కరించ బడితే ఇక అణ్వాయుధాల అవసరం వుండబోదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. హెచ్బిఓకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా అణ్వాయుధాలను సమకూర్చుకున్న దేశం పాకిస్తాన్ అని ఇంటెలిజెన్స్ విశ్లేషకులు అంటుంటారు. ఎందుకని అని జర్నలిస్టు ప్రశ్నించగా దానికి సమాధానంగా ఎందుకు అలా అంటారో నాకు తెలియదు, కానీ పాక్ అణ్వాయుధాలు కేవలం మమ్మల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవని అన్నారు. అయితే భవిష్యత్తులో ఆ ఆయుధాలు పెరుగుతాయో లేదో చెప్పలేనని అన్నారు. నాకు తెలిసినంతవరకు, దాడికి ఉద్దేశించిన ఆయుధాలు కావవి, తమ దేశానికి ఏడు రెట్లు పెద్దగా వున్న దేశం పొరుగున వుంటే ఎవరికైనా ఆందోళన వుంటుందని అన్నారు. అణ్వాయుధాలకు తాను వ్యతిరేకినని చెప్పారు. భారత్‌పై మూడు యుద్ధాలు జరిగాయి. కానీ మాకు అణ్వాయుధం వున్నప్పటి నుండి ఇరు దేశాల మధ్య యుద్ధాలే లేవు. సరిహద్దుల వద్ద ఘర్షణలు వున్నాయి, కానీ యుద్ధాన్ని ఎన్నడూ ఎదుర్కొనలేదని అన్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమైన మరుక్షణం రెండు దేశాలు నాగరికుల్లా జీవిస్తాయి. అప్పుడు అణ్వాయుధాలే అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ దేశాల్లో ఇస్లామ్ ఫోబియా గురించి ఎందుకు బహిరంగంగా మాట్లాడరని, చైనాలోని ఉయిగర్ ముస్లింల గురించి ఎందుకు మౌనంగా వూరుకున్నారని ప్రశ్నించగా, చైనాతో జనాంతిక సమావేశాలు జరుగుతాయని అక్కడ అన్ని అంశాలు చర్చిస్తామని తెలిపారు. పాలస్తీనా, లిబియా, సోమాలియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అన్నిచోట్లా ఏదో ఒకటి జరుగుతునే వుంటుంది. ప్రతీదాన్ని గురించి మేం మాట్లాడాలా? మా సరిహద్దుల్లో, మా దేశంలో ఏం జరుగుతోందో దానిపైనే మా దృష్టంతా వుంటుందని అన్నారు. ఉయిగర్ ముస్లింల గురించి మాట్లాడేవారు ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజల గురించి ఎందుకు మాట్లాడరని ఎదురు ప్రశ్నించారు.