Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎన్ఓలో బహిర్గతం
- మానవ హక్కుల మండలి సమావేశంలో చైనాకు భారీగా మద్దతు
న్యూయార్క్ : ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మానవ హక్కుల అంశాలను ఉపయోగించుకునే కొన్ని పశ్చిమ దేశాల కపట బుద్ధి మరోసారి తేటతెల్లమైంది. మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో చైనాకు మద్దతుగా 90కి పైగా దేశాలు నిలిచాయి. మానవ హక్కుల అంశంపై చైనాను ఒంటరిపాటు చేయాలని యత్నించిన పశ్చిమ దేశాలు వివరికి తామే ఒంటరిపాటయ్యాయి. అమెరికా, దాని మిత్ర దేశాల ప్రచారం ఎంత బూటకమో దీంతో మరోసారి స్పష్టమైందనిచైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. మానవ హక్కుల మండలి 47వ సమావేశంలో కెనడా ప్రతినిధి మాట్లాడుతూ, స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షింజియాంగ్లో ఉయిఘర్స్ విషయంలోను, హాంకాంగ్, టిబెట్ల్లో చైనా చర్యలపై ఆరోపణలు చేశారు. కొన్ని పశ్చిమదేశాల తరపున వకాల్తా పుచ్చుకుని కెనడా ఈ ఆరోపణలు చేసింది. మరోవైపు 90కి పైగా దేశాలు చైనా చట్టబద్ధమైన వైఖరికి వివిధ రీతుల్లో మద్దతు తెలిపాయి. చైనా ప్రతిష్టను దెబ్బతీయడానికే షింజియాంగ్, హాంకాంగ్, టిబెట్ పై పశ్చిమ దేశాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. బెలారస్ ప్రతినిధి ఈ సమావేశంలో మాట్లాడుతూ, సార్వభౌమాధికార దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, ఇతర దేశాల సార్వభౌమాధికార, స్వాతంత్య్ర, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడం అంతర్జాతీయ సంబంధాల్లో పాటించాల్సిన మౌలిక నియమాన్ని కూడా అమెరికా పాటించడం లేదని విమర్శించారు. హాంకాంగ్, టిబెట్, షింజియాంగ్ వ్యవహారాలు చైనా అంతర్గత అంశాలని వాటిలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటన పేర్కొంది. చైనా వైఖరిని సమర్ధిస్తూ ఆరుగురు సభ్యులు గల గల్ఫ్ సహకార మండలి ఉమ్మడిగా లేఖ పంపింది. చైనాకు మద్దతిస్తూ 20కి పైగా దేశాలు విడివిడిగా ప్రసంగాలు చేయడానికి సిద్ధంగా వున్నాయి. హాంకాంగ్, టిబెట్, షింజియాంగ్ వ్యవహారాలకు మానవ హక్కులకు ఏమాత్రమూ సంబంధం లేదేని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. తమ వైఖరిని చైనా చాలాసార్లు తెలియచేసిందని, సవివరంగా వాస్తవాలు వెల్లడించిందని, కానీ నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వారిని ఇవేవీ మేల్కొనలేకపోయాయని చైనా ప్రతినిధి వ్యాఖ్యానించారు. మానవ హక్కుల పరిరక్షణకు, దేశాల సార్వభౌమాదికారానికి, భద్రతకు చైనా కట్టుబడి వుందని అన్నారు. మానవ హక్కుల గురించి లెక్చర్లిచ్చే పశ్చిమ దేశాలు తమ స్వంత మానవ హక్కులగురించి మరచిపోతున్నాయని ఆయన విమర్శించారు. వర్ణ వివక్షత, తుపాకి హింస, ఇతర దేశాల్లో సైనిక జోక్యం వంటి సమస్యలను ఎదుర్కొనే ఈ దేశాలకు ఇతర దేశాలను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. .