Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గ్రీన్ పాస్‌పోర్ట్' జాబితాలో చోటు దక్కని కోవిషీల్డ్
- త్వరలో అన్ని అనుమతులూ తీసుకుంటాం : సీరం సీఈఓ అదర్ పూనావాలా
లండన్ : ఇతర దేశాలకు వెళ్లాలన్నా..అక్కడ్నుంచి మరో చోటకు పోవాలన్నా..పాస్‌పోర్ట్, వీసా..తదితర పత్రాలు తప్పనిసరి. కరోనా సంక్షోభం తర్వాత మరో కీలక పత్రం ఇప్పుడు అవసరమవుతోంది. అదే..'గ్రీన్ పాస్‌పోర్ట్'. ఏందీ..గ్రీన్ పాస్‌పోర్ట్ ? అనుకుంటున్నారా? ఏ దేశం వెళ్లాలనుకుంటున్నామో..ఆ దేశం అధికారికంగా గుర్తించిన వ్యాక్సిన్ మనం తీసుకొని ఉండాలి. అప్పుడే గ్రీన్ పాస్‌పోర్ట్ వస్తుంది. మనదేశంలో పెద్ద సంఖ్యలో 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉన్నారు. అయితే వీరిలో యూరప్‌కు వెళ్లాలనుకునేవారికి గ్రీన్ పాస్‌పోర్ట్ రావటం లేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ 'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్' కార్యక్రమంలో భాగంగా విడుదలజేసిన జాబితాలో 'కోవిషీల్డ్' పేరు లేదు. దీనిపై మనదేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న 'సీరం ఇన్స్టిట్యూట్' కంపెనీకి ఫిర్యాదుల వెళ్లాయి. 'యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ' (ఈఎంఏ) అనుమతి పొందేందుకు సీరం సంస్థ దరఖాస్తు చేయకపోవటమే ఈ సమస్యకు కారణమని తెలిసింది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందినా ఈయూ గ్రీన్ పాస్‌లో కోవిషీల్డ్‌కు చోటు దక్కకపోవటం చర్చనీయాంశమైంది. సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, నియంత్రణా సంస్థ అనుమతులు పొందుతామని తెలిపారు.
మందు అక్కడిదే అయినా..
ఈయూ దేశాల్లో ఔషధాలు, టీకాలు..మొదలైన వైద్య ఉత్పత్తులకు ఈఎంఏ సంస్థ అనుమతి ఇస్తుంది. ఈ సంస్థ గుర్తింపు వచ్చిన తర్వాతే అక్కడ అవి మార్కెట్లోకి విడుదలవుతాయి. ఈయూ ఇచ్చే 'గ్రీన్ పాస్‌పోర్ట్' జాబితాను ఈఎంఏ సంస్థ రూపొందించింది. ఆక్స్ఫర్డ్ వారి 'ఆస్ట్రాజెనికా', పిఫైజర్ కంపెనీకి చెందిన 'కోమినాటీ', మోడెర్నా వారి 'స్పైక్వ్యాక్స్', జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన 'జాన్సెన్'..అనే నాలుగు వ్యాక్సిన్లకు మాత్రమే ఈయూ గ్రీన్ పాస్‌పోర్ట్‌లో చోటుదక్కింది. ఆస్ట్రాజెనికా మందునే భారత్ వెర్షన్‌గా సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ 'కోవిషీల్డ్'. అయినప్పటికీ ఈయూలో ఈ వ్యాక్సిన్‌కు గుర్తింపు దక్కలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటివరకు 8 కోవిడ్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చింది. ఈ జాబితాలో మాత్రం కోవిషీల్డ్‌కు చోటు దక్కింది. అయితే భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న 'కోవాక్సిన్'కు ఈఎంఏ, డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించలేదు.