Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : బ్రిటీష్ యుద్ధ నౌక హెచ్ఎంఎస్ డిఫెండర్ రష్యా ప్రాదేశిక జలాలను అతిక్రమించడాన్ని కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించారు. నల్ల సముద్ర జలాల్లో క్రిమియాకు సమీపంలో గతవారం జరిగిన ఘటనలో బ్రిటన్ మిత్రుల (అమెరికా) హస్తం కూడా వుందని ఆయన వ్యాఖ్యానించారు. నాటో సామూహిక రక్షణ ఒప్పందంలో 5వ అధికరణపై సందేహాలు వ్యక్తం చేస్తూ, ఈ యుద్ధ నౌకను రష్యా ఒకవేళ ముంచేసినా అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీయబోదని అన్నారు. ఎందుకంటే ఇటువంటి ఘర్షణలో తాము గెలవలేమని అమెరికా, బ్రిటన్కు తెలుసునని అన్నారు. గత వారం ఘటనలో అమెరికా నిఘా విమానం పాత్ర కూడా వుందని పుతిన్ చెప్పారు. బ్రిటీష్ డిస్ట్రాయర్ విన్యాసాలకు రష్యా సైన్యం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో తెలుసుకోవడానికే అమెరికా నిఘా విమాన మిషన్ ఉద్దేశించిబడిందని పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉద్దేశ్యాలు రష్యాకి తెలుసునని, అందుకే సున్నితమైన డేటాను వెల్లడించకుండా అందుకు అనుగుణంగానే స్పందించిందని చెప్పారు. అంతర్జాతీయంగా గుర్తించబడిన మార్గంలోనే తమ యుద్ధనౌక వెళ్లిందని తాము రష్యా ప్రాదేశిక జలాలను అతిక్రమించలేదని బ్రిటన్ వాదిస్తోంది. క్రిమియాను ఉక్రెయిన్లో భాగంగానే బ్రిటన్ గుర్తిస్తోంది. కాగా ఈ చర్యను కవ్వింపు చర్యగా అభివర్ణించిన పుతిన్, మరోసారి ఇలా జరిగితే ఆ యుద్ధనౌకను పేల్చివేస్తామని హెచ్చరించారు.