Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముప్పు ముంచుకొస్తున్న వేళ.. తక్షణ కార్యాచరణ అవశ్యం : గుటెరస్
గ్లాస్గో : వాతావరణ మార్పులతో ముప్పు ముంచుకొస్తున్న వేళ...రాన్రాను పెరుగుతున్న భూ తాపానికి కళ్ళెం వేసేందుకు ప్రపంచ నేతలు ఇక్కడ సమావేశమయ్యారు. భూమాతను కాపాడుకునేందుకు అన్ని దేశాలు గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపు 200 దేశాలకు చెందిన నేతలు పాల్గొంటున్నారు. బొగ్గు, చమురు, సహజవాయువులను మండించడం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నా యి. ఈ పెను మార్పులను అదుపు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు.. ప్రపంచం 'డూమ్స్ డే' పరికరంతో అనుసంథానించబడి వుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ అంతర్జాతీయ వాతావరణ సదస్సును ఆయన ప్రారంభించారు. నానాటికి వేడెక్కిపోతు న్న భూగోళాన్ని సీక్రెట్ ఏజెంట్ జేమ్స్‌బాండ్ వూహాత్మక కల్పన 'డూమ్స్ డే'తో పోల్చి చెప్పారు. ఏ క్షణాన్నైనా భూగోళాన్ని అంతమొందించగల బాంబును చేతికి కట్టుకుని వున్నామని, దీన్ని ఎలా నిర్వీర్యం చేయాలా అని ప్రయత్నిస్తున్నామన్నారు. ''మనందరం దాదాపు ఒకే పరిస్థితిలో వున్నాం'' అని ఆయన ప్రపంచ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు డూమ్స్ డే పరికరం టిక్ టిక్మంటోంది. ఇది కల్పన కాదు, వాస్తవం' అని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సులో భాగంగా ప్రపంచ నేతల సదస్సును జాన్సన్ ప్రారంభించారు. ఇప్పటికే భూగోళం 1.1 డిగ్రీల సెల్సియస్ (2 డిగ్రీల ఫారిన్‌హీట్) మేరా వేడెక్కింది. రాబోయే దశాబ్ద కాలంలో వెలువడే కాలుష్య కారక వాయువుల ప్రాతిపదికగా ప్రస్తుతం వెలువడుతున్న అంచనాలను చూసినట్లైతే 2100నాటికి ఉష్ణోగ్రతలు 2.7డిగ్రీల సెల్సియస్ (4.9ఫారెన్హీ ట్) తాకుతాయని భావిస్తున్నారు. ఇక కార్యాచరణ చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని జాన్సన్ పేర్కొన్నారు. ఇక్కడ సగటు వయస్సు 60ఏళ్ళు వున్నవారు 130మందికి పైగా వున్నామని, కానీ వాతావరణ మార్పుల వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే తరాలు ఇంకా పుట్టాల్సి వుందని అన్నారు. దశలవారీగా పెట్రోల్ కారులకు, బొగ్గు వాడకానికి అంతం పలకాలి. అడవులు నరకడాన్నిఆపాలని పిలుపిచ్చారు. రోమ్‌లో జరిగిన జి20 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి నేతలు ఒక మోస్తరుగా హామీలిచ్చిన నేపథ్యంలో ఈ సదస్సు ప్రారంభమైంది.
మన గోతులు మనమే తవ్వుకుంటున్నాం : గుటెరస్
''కర్బన ఉద్గారాలతో మనల్ని మనమే చంపుకోవడాన్ని ఇక ఆపుచేయాల్సి వుంది.'ఇక చాలు' అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతిని మరుగుదొడ్డిలా ఉపయోగించుకో వడాన్ని ఇంక ఆపాలి.శిలాజ ఇంధనాలకు మనం బానిసలై పోయాం.మానవాళిని ముప్పు వైపునకు లాక్కెళుతున్నది ఇదే.మన గోతిని మనమే తవ్వుకుంటున్నాం.'' అని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటానియో గుటెరస్ హెచ్చరించారు. మనం దాన్ని నిలువరించాలి, లేదా అదే మనల్ని నిలువరిస్తుందని వ్యాఖ్యానించారు.