- కజకస్తాన్‌లో అట్టుడుకుతున్న నిరసనలు, ఆందోళనలు ఆల్మటీ : ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం కజకస్థాన్ వ్యాప్తంగా విస్తృతంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. ఆగ్రహంతో వున్న ప్రజలు ఆల్మటీలోని మేయర్ కార్యాలయంలోకి చొరబడ్డారు. మరో ప్రధాన నగరమైన అక్టోబేలో పాలనా భవన కార్యాలయాన్ని ప్రదర్శకులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. బుధవారం పొద్దునే ఆల్మటీలోని మేయర్ కార్యాలయం వెలుపల దాదాపు 3వేల మంది ప్రజలు గుమిగూడారు. వారిలో చాలామంది బాట్లు, కర్రలు వంటి వాటిని పట్టుకుని వచ్చారు. వారందరూ భవనంలోకి చొరబడుతుండడంతో శాంతి భద్రతల బృందం వెంటనే రంగంలోకి దిగింది. గ్రెనెడ్లను ఉపయోగించడంతో సహా ఇతర పద్దతుల ద్వారా ప్రజల్ని నియంత్రించేందుకు ప్రయత్నించింది. అయితే, వేలాదిమందిగా వస్తున్న వారిని అదుపుచేయడం అధికారులకు సాధ్యం కాలేదు. చివరకు అనుకున్నట్లుగానే ఆందోళనకారులు లోపలకు చొరబడ్డారు. ఈ ఘర్షణల్లో శాంతి భద్రతల అధికారుల హెల్మెట్లను, ఇతర కవచాలను ప్రదర్శకులు లాగిపారేశారు. ప్రాసిక్యూటర్ కార్యాలయంలో నిప్పంటించినట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గొడవలు జరిగినట్లు వార్తలందాయి. కాగా ఆందోళనల సందర్భంగా అంబులెన్సులు, ఆస్పత్రులపై కూడా విరుచుకుపడ్డారని డాక్టర్లు, డ్రైవర్లు ఐదుగురు గాయపడ్డారని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. రష్యా సరిహద్దుకు ఎంతో దూరంలో లేని మరో నగరమైన అక్టోబేలో పెద్ద సంఖ్యలో ప్రజలు నగర పాలనా కార్యాలయ భవనంలోకి దూసుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనట్టు కనిపిస్తోంది. కాగా ప్రదర్శకులను అరెస్టు చేయడానికి అధికారులు కూడా తిరస్కరిస్తున్నారని ధ్రువీకరించని వార్తలు తెలుపుతున్నాయి. వారు ప్రజలకు సంఘీభావాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్‌లో దాదాపు వెయ్యిమంది ప్రదర్శనలో పాల్గొన్నారు.