- సార్వత్రిక సామాజిక భద్రతను కల్పించే కొత్త వైద్య వ్యవస్థ - నయా ఉదారవాద ప్రయివేటు హెల్త్ సిస్టంకు చెల్లు చీటీ చిలీ : గతనెల చిలీలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బోరిక్ 54 శాతం ఓట్లతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో గెలిస్తే వైద్య రంగంలో మార్పులు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు చిలీలో అమలవుతున్న వైద్య వ్యవస్థ 1980లో సైనిక నియంతృత్వ ప్రభుత్వం రూపొందించింది. అది ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలు పెంచే లక్ష్యంతో రూపొందించిన విధానం. ఈ విధానంలో కార్మికులు, ఉద్యోగులు తమ వేతనాల నుంచి డబ్బులు చెల్లించి వైద్యం పొందేవారు. కొంత డబ్బును ప్రభుత్వం కేటాయించేది. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రస్తుతం చెల్లిస్తున్న 7 శాతాన్ని వైద్యరంగానికి కేటాయించకుండా వ్యక్తిగత ఇన్సూరెన్సు పాలసీలను పొందే అవకాశం కల్పించారు. అంటే డబ్బు చెల్లించి వైద్యం పొందడమన్న మాట. డబ్బులు చెల్లించే శక్తి లేకపోతే వైద్యం అందదు.వామపక్ష వాది అయిన బోరిక్ ప్రవేశపెడుతున్న కొత్త వైద్య వ్యవస్థ సార్వత్రిక సామాజిక భద్రతను కల్పించే లక్ష్యంతో ఉండబోతున్నది. ఆరోగ్య పరిరక్షణ.. అంటే ముందు జాగ్రత్తలు పాటించటం, సంరక్షణ లక్ష్యంగా ఇది ఉండబోతున్నది .ఇప్పటివరకు ఉన్న వ్యవస్థ వ్యాధి వస్తేనే మందులు అందించే లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్నది. కొత్త ఆరోగ్య వ్యవస్థ రూపుదిద్దుకుని విజయవంతంగా అమలు జరగడానికి మహిళల భాగస్వామ్యం బాగా పెంచవలసిన అవసరం ఉన్నది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు లో మహిళల పాత్ర గణనీయంగా ఉన్నందున వారిని కొత్త ఆరోగ్య వ్యవస్థ లో కూడా భాగస్వాములను చేయడం మంచి ఫలితాలనిస్తుంది.