రష్యా అధీనంలోకి అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ సముదాయం
Sun 22 May 05:20:06.141427 2022
మాస్కో : ఉక్రెయిన్ ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో అజోవ్‌స్తల్ ఫ్యాక్టరీ సముదాయం మొత్తంగా తమ అధీనంలోకి వచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దాదాపు నెల రోజుల పాటు 2,400మంది ఆ ఫ్యాక్టరీలో వున్నారు. వీరిలో ఉక్రెయిన్ సైనికులు, ఇతర ప్రజలు ఉన్నారు. వీరందరూ తమ ఆయుధాలను వదిలి లొంగిపోయారని రష్యా అధికారులు తెలిపారు. ''చివరగా శుక్రవారం నాడు 531మంది తీవ్రవాదులు లొంగిపోయారు.'' అని రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుండి మొత్తంగా 2,439 మంది తమ ఆయుధాలు వీడారని చెప్పారు. ఇప్పుడు అజోవ్‌స్తల్ సముదాయం రష్యా సాయుధ బలగాల చేతికి వచ్చిందని తెలిపారు. విజయవంతంగా ఈ ఆపరేషన్ ముగిసిందని శుక్రవారం రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు, పుతిన్‌కు తెలియచేశారని కొనషెంకోవ్ తెలిపారు.