Authorization
Fri March 14, 2025 09:26:49 pm
మొగదిషు : బాంబు పేలుళ్లతో సోమాలియా రాజధాని మొగదిషు దద్దరిల్లింది. శక్తివంతమైన కారుబాంబు పేలుళ్లలో సుమారు 100 మంది మరణించగా, మరో 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. దాడి ఘటనపై సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానికంగా రద్దీగా ఉండే జోబ్ కూడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయం, పాఠశాల వెలుపల బాంబు పేలుడు జరిగిందని, మతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. మొదటి పేలుడు తర్వాత గాయపడిన వారిని తరలించేందుకు పెద్ద ఎత్తున అంబులెన్సులు, ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారని, అదే సమయంలో మరోసారి పేలుడు జరిగిందని అన్నారు. మహిళలు, చిన్నారులు, యువత ఈ ఘటనలో అధికంగా మరణించారని స్థానిక మీడియా పేర్కొంది. స్వతంత్ర జర్నలిస్ట్ మొహ్మద్ ఇస్సె కోనా కూడా మరణించారని తెలిపింది. ఈ పేలుళ్లకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే 'అల్ షబాబ్' ఈ పేలుడుకు కారణమై ఉండవచ్చని అధ్యక్షుడు పేర్కొన్నారు.