Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ బుధవారం బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని రిషి సునాక్‌తో ఆయన చర్చలు జరుపుతారని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ పార్లమెంట్లో కూడా జెలెన్స్కీ ప్రసంగిస్తారని, బ్రిటన్ మిలటరీ చీఫ్‌లతో భేటీ అవుతారని తెలిపింది. సైనిక చర్య ప్రారంభమైన రెండు వారాల తర్వాత గత మార్చిలో మారుమూల ప్రాంతం నుండి జెలెన్స్కీ బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించారు. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సైనికపరంగా మద్దతునిస్తున్న అతిపెద్ద దేశం బ్రిటన్. ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సామాగ్రి రూపంలో 250కోట్ల డాలర్లకు పైగా మొత్తాన్ని పంపింది. నాటో ప్రమాణాలు కలిగిన యుద్ధ విమానాల్లో ఉక్రెయిన్ పైలట్లకు బ్రిటన్ శిక్షణ ఇస్తుందని సునాక్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. యుద్ధ విమానాలను పంపాల్సిందిగా ఉక్రెయిన్ తన మిత్ర దేశాలను కోరింది. అయితే బ్రిటీష్ యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు పంపడం ఆచరణలో సాధ్యం కానిదని, కానీ శిక్షణ ఇస్తామని సునాక్ చెప్పారు. బ్రిటన్‌లోని స్థావరాల్లో 10వేల మందికి పైగా ఉక్రెయిన్ బలగాలు శిక్షణ పొందాయి. బ్రిటన్ పంపుతున్న ఛాలెంజర్ 2 ట్యాంకులపై కూడా వీరికి శిక్షణ అందింది.