Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహోర్ : ప్రముఖ కవి, గేయరచయిత జావేద్ అక్తర్ పాకిస్తాన్‌పై ఆ దేశంలోనే ఘాటు విమర్శలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులు లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్మారకార్థం లాహోర్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గతవారం జావేద్ పాకిస్తాన్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకులతో నిర్వహించిన ముఖాముఖీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మీరు ఎన్నోసార్లు పాకిస్తాన్ వచ్చారు. మీ దేశానికి తిరిగి వెళ్లినపుడు పాకిస్తాన్ ప్రజలకు బాంబులు వేయడమే కాదు.. పూలదండలు వేయడం, ప్రేమను అందిస్తారని చెప్తారా అని వారు జావేద్‌ను ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదనీ, పైగా ఉద్రిక్తతలు పెరుగుతాయని అన్నారు. వాటిని తగ్గించాల్సిన అవసరముందని జావేద్ తెలిపారు. తాను ముంబయికి చెందిన వ్యక్తిననీ, తమ నగరంపై జరిపిన ఉగ్రదాడిని మరిచిపోలేమని అన్నారు. ఆ నిందితులు ఈజిప్టు లేదా నార్వే నుండి వచ్చిన వారు కాదని, వారంతా ఇదే దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. భారతీయుల మనసుల్లో ఆగ్రహం ఉంటే మీరు ఫిర్యాదు చేయలేరని జావేద్ సమాధానమిచ్చారు. పాక్ ప్రముఖులకు భారత్ ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్లో స్వాగతం లభించలేదని దుయ్యబట్టారు. నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్థం తాము పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా? అని ప్రశ్నించారు.