Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంగుతిన్న అమెరికా!
బీజింగ్ : అనేక ఏండ్లపాటు బద్ధ శత్రువులుగావున్న సౌదీ అరేబియా-ఇరాన్ దేశాలు చైనా మధ్యవర్తిత్వంతో బీజింగ్‌లో సమావేశమై దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామంతో అమెరికా కంగుతున్నదని ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. ఇదే విషయాన్ని అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ సౌదీ అధికారులకు చెప్పారు. సౌదీ అరేబియా, ఇరాన్ సంబంధాల సాధారణీకరణ మధ్యప్రాచ్చంలో అమెరికా కుటిల నీతికి చావుదెబ్బవంటిది. ఇస్లామిక్ దేశాల మధ్యగల విబేధాలను, విద్వేషాలను పెంచుతూ, యుద్ధాలను ప్రోత్సహిస్తూ తన ఆయుధ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న అమెరికాకు ఇది మింగుడుపడని పరిణామం.చైనా రాజధాని బీజింగ్ లో ఇరాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు గురువారం సమావేశమై తాజా చొరవకు చెందిన అనేక విషయాలను చర్చించారు. ఇరు దేశాలలో దౌత్య కార్యాలయాలను తిరిగి ప్రారంభించాలనీ, రాయబారులను నియమించాలనే కాకుండా ఇరాన్ అధ్యక్షులు ఇబ్రాహిమ్ రైసీ సౌదీ అరేబియాని సందర్శించే విషయాన్ని కూడా వారు చర్చించారు. అనేక ఏండ్లపాటు ప్రాంతీయ శత్రువులుగా కొనసాగిన ఇరాన్, సౌదీ అరేబియా చైనా మద్యవర్తిత్వంతో మార్చి 10వ తేదీనాడు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందంలో భాగంగానే 2016వ సంవత్సరంలో ఉపసంహరించుకున్న దౌత్య సంబంధాలను తిరిగి పునరుద్దరించాలనే నిర్ణయం జరిగింది. చైనా కృషితో జరిగిన ఈ దౌత్య విజయం మధ్యప్రాచ్చ భౌగోళిక రాజకీయాలలో పెను మార్పులను తీసుకుని వస్తుందనటంలో సందేహం లేదు. ఈ ఒప్పందం తరువాత సౌదీ అరేబియా, ఇరాన్ దౌత్యవేత్తలు యెమెన్‌లో వేలాది ప్రజల మరణాలకు కారణమైన యుద్ధాన్ని ఆపటానికి అనేకసార్లు చర్చలు జరిపారు. అలాగే ఇరాన్ యుఏఈతో సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి ప్రయత్నాలను ప్రారంభించింది. సౌదీ అరేబియా కూడా సిరియాతో సంబంధాలను పునరుద్దరించుకోవటానికి అధ్యక్షులు అస్సద్ ను తమ దేశాన్ని సందర్శించవలసిందిగా కోరనున్నది.