Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : పశ్చమ ఆసియాలోని ఉపప్రాంతం పేరే మధ్యప్రాచ్యం. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండాలు కలిసే వ్యూహాత్మక ప్రాంతమే మధ్యప్రాచ్యం. భౌగోళిక-రాజకీయ ఆధిపత్యం కోసం చరిత్రలో ఈ ప్రాంతంలో ఈజిప్షియన్లు, గ్రీకులు, పర్షియన్లు, రోమన్లు, అరబ్బులు, టర్కులు, బ్రిటీష్, ఫ్రెంచ్, అమెరికన్లు, రష్యన్లవంటి అనేక జాతుల మధ్య ఎన్నో పోరాటాలు జరిగాయి. అలాగే పరస్పరం కత్తులు దూసుకునే మూడు మతాలకు (క్రైస్తవం, జుదాయిజం లేక యూదు మతం, ఇస్లాం) మధ్యప్రాచ్యమే జన్మస్థలం.
ఈ మధ్యకాలందాకా అప్రతిహత ఆధిపత్యాన్ని చెలాయించిన అమెరికా ఈ ప్రాంతంపై వేగంగా తన పట్టును కోల్పోతోంది. మధ్యప్రాచ్యంలో ప్రధాన పాత్రధారులందరికీ అమెరికా దూరమైంది. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని దేశాలూ అమెరికాను ఆనందపరచటానికి నిర్ణయాలు తీసుకోవటం మానేశాయి. టర్కీలో అమెరికా పలుకుబడి నామమాత్రం అయింది. ఇరాన్‌తో అమెరికా శత్రుత్వం పెంచుకుంది. సౌదీ అరేబియాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాలస్తీనాతో అమెరికాకు ఎటువంటి సంబంధమూ లేదు. రష్యా, చైనాలతో సంబంధాల విషయంలో వచ్చిన తేడావల్ల అమెరికాకు ఇజ్రాయిల్‌తో కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఈజిప్టుకు అమెరికా అంటే అంత గౌరవం లేదు. తన ప్రయోజనాలను తాను చూసుకుంటూ పక్కా వ్యాపార దేశంగా మారిపోయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటోంది.
అమెరికా మాత్రమే ఈ ప్రాంతంపైన తన పట్టును కోల్పోలేదు. ఒకప్పుడు ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని చెలాయించిన గత కాలపు సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ కూడా తమ పలుకుబడిని కోల్పోయాయి.
ఈ కాలక్రమంలో ఇరాన్‌తో అమెరికా శత్రుత్వం పెంచుకుంది. ప్రచ్చన్న యుద్ధానంతర కాలంలో ఇరాక్, సిరియాలలో అమెరికా అనేక వ్యూహాత్మక తప్పిదాలను చేసింది. పర్యవసానంగా వివిధ మధ్యప్రాచ్య దేశాలలో ఇరాన్ పలుకుబడి పెరిగి ఇరాన్ అనుకూల శక్తులవల్ల ఇజ్రాయిల్, ఇతర గల్ప్ దేశాలలో అభద్రతాభావం ఏర్పడింది. ఈ అభద్రతవల్లే ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇరాన్‌ను తన సైనిక శక్తితో అమెరికా భయపెడుతున్నప్పటికీ గల్ప్ ప్రాంతంలో ఇరాన్ పలుకుబడిని తగ్గించలేకపోయింది.
ఈమధ్య కాలంలో అమెరికా-సౌదీ అరేబియా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇస్లాం వ్యతిరేకత, సౌదీ అరేబియా టెర్రరిస్టుల స్థావరం అనే అపోహ అమెరికాకు ఉండటంవల్ల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అత్యంత కరడుగట్టిన ఇస్లామిక్ సమాజంగావున్న సౌదీలో ఎమ్ బి ఎస్ గా పిలవబడుతున్న రాకుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ పెద్ద ఎత్తున్న సంస్కరణలను ప్రవేశపెట్టాడు. తత్ఫలితంగా సౌదీలో వేగంగా సామాజిక ఉదారీకరణ జరుగుతోంది. అయినప్పటికీ అమెరికాలోవున్న సామాజిక విలువలకు, సౌదీ సమాజానికి మధ్య తేడా పూడ్చనలవికానంతగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ అవలంబిస్తున్న ''అమెరికా ఫస్ట్'' విధానంవల్ల సౌదీతో సహా ఇతర దేశాలలో కూడా జాతీయ ప్రయోజనాలతో రాజీపడకూడదనే భావన ఏర్పడింది. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తమ డెమోక్రాటిక్ పార్టీ గెలుపుకు అనుకూలంగా ఉంటుందని చమురు ధరను తగ్గించటానికి చమురు ఉత్పత్తి స్థాయిని పెంచాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కోరినప్పుడు సౌదీ అరేబియా సానుకూలంగా స్పందించలేదు. అలాగే తన ప్రత్యర్థులైన చైనా, రష్యాలకు వ్యతిరేకంగా అమెరికా సౌదీ మద్దతు కోరినప్పుడు కూడా సౌదీ అంగీకరించలేదు. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం తప్పైనప్పటికీ అది నాటో విస్తరణవల్ల, అమెరికా జోక్యంవల్ల జరుగుతోందని సౌదీ అరేబియా భావిస్తోంది. ఈ సందర్బంగా లెబనాన్, సిరియాలలో ఇజ్రాయిల్ దాడులు, ఇరాక్‌పైన అమెరికా చేసిన ఘోరమైన యుద్ధం, లిబియాలో నాటో జోక్యం, సిరియాలో అమెరికా రహస్య కార్యకలాపాలు సౌదీ అరేబియా గుర్తుచేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఆచరణకు భిన్నంగా చైనా వ్యవహరిస్తోంది. చైనా చమురు దిగుమతుల్లో మూడవ వంతు జీసీసీ దేశాల నుంచే వస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా సౌదీ అరేబియా నుంచే చైనా చమురును దిగుమతి చేసుకుంటోంది. బీసీసీ దేశాల చమురు ఎగుమతుల్లో 6వ వంతు, ఇరాన్ చమురు ఎగుమతుల్లో 5వ వంతు, ఇరాక్ చమురు ఎగుమతుల్లో సగం వరకు చైనా దిగుమతి చేసుకుంటూ ఈ ప్రాంతంలో ప్రముఖ వ్యాపార భాగస్వామిగాను, పెట్టుబడిదారుగాను చైనా ఎదిగింది. పర్యవసానంగా మధ్యప్రాచ్య దేశాలు చైనాతో సంపర్కాన్ని మరింతగా కోరుకుంటున్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 17 అరబ్ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా పెట్టిన ఆక్షలవల్ల ఇరాన్ ముందుగా చైనావైపు, ఆ తరువాత రష్యావైపు మొగ్గింది.
సౌదీ అరేబియాతో సహా మధ్యప్రాచ్య దేశాలలో చాలావరకు అమెరికాపైన అతిగా ఆధారపడకూడదనే భావనకు వచ్చాయి. అందువల్ల అవి చైనా, రష్యా, ఇండియావంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలలో తమ ప్రయోజనాలకు భిన్నంగా అమెరికాకు కొమ్ముకాయటం మానుకున్నాయి. అమెరికావలే చైనా ఈ ప్రాంతంలోని దేశాల రాజకీయ వ్యవస్థలను, సామాజిక విలువలను మార్చుకోమని కోరటం లేదు. చైనా ఈ దేశాలను, నాయకులను అవమానించటం లేదు. ఇలా చైనా వాణిజ్యం, పెట్టుబడుల మీద ద్రుష్టిని సారించి పశ్చిమాసియాలోని రాజకీయ తగాదాల జోలికి పోకపోవటంవల్ల ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, సిరియాలతోసహా అన్ని మధ్యప్రాచ్య దేశాలతో చైనాకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకవైపు చైనా వివిధ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపడేలా చేస్తుంటే మరోవైపు అమెరికా మధ్యప్రాచ్యంలో చైనా పలుకుబడిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఆవిధంగా లోపభూయిష్టమైన అమెరికా విధానాలవల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యం బలహీనపడి చైనా, రష్యాల ప్రాబల్యం వేగంగా పెరుగుతోంది.