Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ :ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ప్రకటించాక అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపైన 10 సార్లకుపైగా ఆక్షలను విధించాయి. ఈ ఆంక్షలతో పాశ్చాత్య దేశాలు ఊహించినట్టు రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోకపోగా ఆంక్షలు విధించిన దేశాలపైనే వాటి దుష్ప్రభావం పడిందని రష్యా ఆర్థిక మంత్రి అంటన్ సిల్యూనోవ్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నాడు. ఈ ఆంక్షలన్నీ ఎదురుతన్నాయని, పాశ్చాత్య దేశాలలో జీవన వ్యయం తీవ్రంగా పెరిగి సంక్షోభం ఏర్పడిందని, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నదనీ, జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఆయన చెప్పాడు. కాబట్టి ఏమాత్రం దూరదృష్టిలేకుండా రష్యాపైన విధించిన ఆంక్షల పరంపరతో పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలే దెబ్బతింటున్నాయి.
పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చేయటానికి రష్యా వ్యూహాత్మకంగా ఒక స్వతంత్ర విధానంతో ఆంక్షలను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించటానికి పటిష్టమైన బడ్జెట్ నియమాలను ప్రవేశపెట్టింది. అలాగే మీర్ కార్డు, జాతీయ చెల్లింపుల కార్డు వ్యవస్థను రూపొందించి రష్యా ఒక స్వతంత్ర చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటితోపాటు సాంకేతిక సార్వభౌమత్వాన్ని సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి విధానాన్ని అవలంభించటంవల్లనే పాశ్చాత్య దేశాలలోకంటే రష్యాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత తక్కువగా ఉన్నాయి. నిజ వేతనాలు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ సమీకరణాలలో మార్పుజరిగిన నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు వర్దమాన దేశాలపైన అనేక నియమనిబంధనలను పెడుతున్నాయి. ఆంక్షలను విధిస్తున్నాయి. వీటివల్ల డాలర్, యూరోలపైన ప్రపంచంలో విశ్వాసం సన్నగిల్లుతోందని రష్యా ఆర్థిక మంత్రి ప్రకటించాడు. దీనిలో భాగంగానే రష్యా కూడా ''తేలికగా మారకం చేసుకోగలిగే'' కరెన్సీల నుంచి నమ్మదగిన కరెన్సీలలో తన లావాదేవీలను నడుపుతోంది. ఇక్కడ నమ్మదగిన కరెన్సీలు అంటే సరఫరా చేసిన సరుకుల, సేవలకు సంబంధించిన డబ్బును ఎటువంటి ఇబ్బందీ లేకుండా బదిలీచేసే అవకాశంవున్న కరెన్సీలు అని అర్థం. దీనిలో భాగంగానే రష్యా, చైనాల మధ్య జరుగుతున్న లావాదేవీలలో 70శాతం తమతమ కరెన్సీలలోనే జరుగుతోంది. ఇటువంటి ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలు ఎంతగా పెరిగితే ఆమేరకు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్, యూరోల ప్రాబల్యం తగ్గుతుంది.