Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది మృతి
వాషింగ్టన్: వరుస తుఫాన్లతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. టెక్సాస్‌లో 'హార్వే' తుఫాన్ బీభత్సం మరవకముందే, తాజాగా మరో తుఫాన్ 'ఇర్మా' అమెరికాపై విరుచుకుపడుతోంది. ఇర్మా తుఫాన్ కరేబియన్ దీవుల్లో పెను విపత్తును సృష్టించింది. బుధవారం రాత్రి అంటిగ్వా, బార్బుడా, ప్యూర్టోరికా, సెయింట్ మార్టిన్ దీవులపై విరుచుకుపడింది.
ఇర్మా కారణంగా కరేబియన్ దీవులు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ తుఫాన్ కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వ భవనాలు కుప్పకూలాయి. అనేక నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు, తుఫాన్ తీవ్రత 5 కేటగిరిలో ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది దక్షిణ ఫ్లోరిడా దిశగా సాగుతుండటంతో అమెరికా అప్రమత్తమైంది.బార్బుడా, సెయింట్ మార్టిన్ దీవులపై ఇర్మా ప్రభావం విపరీతంగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవి దాదాపు 95శాతం ధ్వంసమైందని అధికారులు తెలిపారు. ఒక్క సెయింట్ మార్టిన్లోనే ఆరుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అతి చిన్న ద్వీపమైన బార్బుడాలో రాళ్లు తప్ప ఏమీ కనబడని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తుఫానులు కూడా రావడం ఇర్మాను మరింత బలపడేలా చేస్తున్నాయి. దీని భారీ ఈదురుగాలులు తోడు కావడంతో చెట్టు నేలకూలుతున్నాయి. సగానికి పైగా దీవుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 30 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉండిపోయారు. వాతావరణం సహకరించకపోవడంతో సహాయక సిబ్బంది కూడా అక్కడికి చేరుకోలేకపోతున్నారు.
గంటకు 195 కి.మీ వేగంతో ఈదురుగాలులు
'ఇర్మా' వారాంతానికి ఫ్లోరిడాను తాకే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఫ్లోరిడా, ప్యూర్టోరికా, వర్జిన్ ద్వీపాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన హరికేన్లలో ఇర్మానే అతి పెద్దదిగా భావిస్తున్నారు. దీని ప్రభావంతో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇటీవల టెక్సాస్‌లో కూడా హరికేన్ హార్వే బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హర్వే ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా టెక్సాస్ సముద్రాన్ని తలపించింది. ఈ హరికేన్ వల్ల దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. బిలియన్ డాలర్ల ఆస్తినష్టం సంభవించింది.