Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదం తప్పిందన్న ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాను గజగజలాడిస్తున్న ఇర్మా తుఫాన్, తాజాగా ఫ్లోరిడా మరోవైపు తీరాన్ని తాకింది. ఆదివారం ఫ్లోరిడాలోని కీస్ వద్ద దక్షిణ తీరాన్ని తాకిన ఇర్మా...సోమవారంనాడు పశ్చిమ తీరానికి చేరుకుంది. పశ్చిమ తీరంలోని మార్కో ద్వీపంలో ఈ తుఫాన్ ప్రతాపాన్ని చూపిస్తోంది. గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇక్కడి నుంచి టాంపా తీరం వైపునకు ఇర్మా చురుగ్గా కదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇర్మా స్థాయి తగ్గుతున్నట్టు కన్పిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తీరం వద్ద 15అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో నాప్లెస్, మార్కో ద్వీపాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫ్లోరిడా మొత్తం హరికేన్ పరిధిలో ఉందని ట్రంప్ అన్నారు. అయితే ఇర్మా పశ్చిమ దిశగా కదులుతుండటంతో చాలా వరకు ముప్పు తప్పిందనే భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అదే తూర్పు దిశగా కదిలితే చాలా ప్రమాదం జరిగేదని.. ఇది అదృష్టమనే చెప్పాలని ట్రంప్ అన్నారు.