Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్
వాషింగ్టన్: అమెరికాతో ద్వై పాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐరాసలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తొలి ప్రసంగం గురించి ప్రస్తావించారు. ''ఉత్తర కొరియాపై పలుమార్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మేము విన్నాం. ఆ దేశాన్ని నాశనం చేయగల సామర్థ్యం అమెరికాకు ఉంది. అందులో మాకు ఎటువంటి అనుమానం లేదు.' అని లావ్రోవ్ స్పష్టం చేశారు. అయితే, పరస్పర సహకారంతోనే అన్ని దేశాలు సమిష్టిగా పనిచేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మాత్రం ప్రశంసిస్తున్నానని అన్నారు. సిరియాలో ఉగ్రసంస్థల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. దీర్-ఎజ్-జోర్ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులను పారద్రోలేందుకు సిరియా బలగాలతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నామని లావ్రోవ్ తెలిపారు.
ఐరాసలో ట్రంప్ చేసిన తొలి ప్రసంగంలోని కీలక అంశాలను క్రెమ్లిన్ కార్యాలయం బుధవారం ప్రచురించింది. దానిలోని వివరాల ప్రకారం... 'తమ దేశం మిత్రదేశాల నుంచి పరస్పర సహకారాన్ని కోరు కుంటుంది. అధికారం కోసం నేను అధ్యక్ష పదవిని చేపట్టలేదు. ప్రజలకు అధికారం అప్పగించాలన్నదే నా ఆకాంక్ష. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ఏదేశం ప్రయత్నించినా ఉపేక్షించబోం. అణ్వాయుధాలు, క్షిపణి ప్రయోగాలతో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తోన్న ఉత్తర కొరియా అంతు చూస్తాం. ఆదేశాన్ని సర్వనాశనం చేస్తాం. ఇరాన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. శరణార్థులను అక్కున చేర్చుకున్న ఘనత అమెరికాదే. ఆశ్రయం కోసం తమ దేశానికి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పొరుగు దేశమైన వెనిజులాలో ఆకలికేకలు పెరిగిపోయాయి. ఆదేశ ఆర్థికాభివృద్ధి తగ్గిపోయింది. ఆదేశ పతనం మొదలైంది' అని ఐరాసలో ట్రంప్ ప్రసంగించారు.