Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరారే : జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్ నాంగాగ్వా శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి. జింబాబ్వే ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నాంగాగ్వాకు సైనికులతో సత్సంబంధాలు ఉన్నాయి. కాగా, తన భార్యని రాజకీయ వారసురాలిగా ప్రకటిస్తానన్న అధ్యక్షుడు ముగాబేకు నాంగాగ్వా ఎదురు తిరిగి ఉద్వాసనకు గురయ్యారు. జింబాబ్వే నుంచి ఇతర ప్రాంతానికి తరలివెళ్లినప్పటికీ జెడ్ఏఎన్యూ-పీఎఫ్ పార్టీతో సత్సంబంధాలను కొనసాగించారు. 37ఏండ్ల ముగాబే నియంత పాలనకు చరమగీతం పాడాల్సిందేనని పార్టీ శ్రేణులకు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో ముగాబేని జింబాబ్వే సైనికులు నిర్బంధించారు. రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. పైగా, దేశ ప్రజలు సైతం వీధుల్లోకి చేరుకుని ముగాబే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించిన ముగాబే ఎట్టకేలకు రాజీనామా ప్రకటించారు. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఆయనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. జింబాబ్వే ద్వితీయ అధ్యక్షుడి ప్రమాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.