Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రాణాలు పోతుంటే.. నేతలు తమాషా చూస్తున్నారు!..'
- వాషింగ్టన్లో ప్రదర్శనకు సిద్ధమవుతున్న విద్యార్థులు!
అమెరికాలో అమాయక ప్రజలపై తూటా పేలిన ప్రతిసారీ ఒక గళం బలంగా వినిపిస్తుంది. అరాచక శక్తుల చేతుల్లో ఆయుధాలు పడకుండా తుపాకుల వినియోగానికి కళ్లెం వేయాలని... తుపాకీ వినియోగాన్ని కఠినతరం చేస్తూ చట్టాలను సవరించాలని ఎంతో మంది ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ... ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ...తుపాకి సంస్కృతిపై చట్టాలను కఠిన తరం చేయాలని డిమాండ్లు వెళ్లువెత్తుతున్నా ... ఫలితం లేదు... ఇటీవల ఫ్లోరిడా ఘటన జరిగిన తర్వాత కూడా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన లేదు...
పైగా ఈ ఘటన తర్వాత 'తుపాకుల నియంత్రపై కాకుండా మానసిక సమస్యపై మాట్లాడారు... 'అమెరికా పాఠశాలలన్నీ కాపాడుకుందాం.. ఏ ఒక్క స్టూటెంట్, టీచర్‌పై ఇకపై ప్రమాదం జరగడానికి వీల్లేదు.... పాఠశాలలన్నీ కాపాడుకునేందుకు స్థానిక నేతలతో కలిసి పని చేస్తాం... మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తా....' అని ట్రంప్ మాట్లాడారు. అమెరికా ఎగువ సభ (సెనేట్) ఆమోదానికి ఆయుధాల నియంత్రణ బిల్లులు నోచుకోవడం లేదు. సభలో చర్చకు వచ్చినప్పుడల్లా ఊక దంపుడు ప్రసంగాలతో కాలయాపన చేస్తున్నారు. ఆమోదానికి నిర్దేశించిన పుణ్యకాలం కాస్తా గడిచిపోయి బిల్లులు మోక్షం పొందకుండానే మూలన పడిపోతున్నాయి.
అమెరికా జనాభా ఎంత ఉందో అంతే సంఖ్యలో తుపాకులు కూడా ఉన్నాయి. వీళ్లందరికీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నేతృత్వం వహిస్తుంది. ఇది అమెరికాలో అత్యంత శక్తివంతమైన లాబీయింగ్ సంస్థ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి రూ.193 కోట్లు (30 మి.డాలర్లు) ఈ సంస్థ విరాళంగా ఇచ్చింది. గత ఏడాది జరిగిన ఈ సంస్థ సదుస్సులో ట్రంపే ప్రధాన ఆకర్షణ. వాండ్ల మనిషి ఆ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ... వైట్ హౌజ్‌లో మనకు నిజమైన మిత్రడు, ఛాంపియన్ ఉన్నారు. చట్ట ప్రకారం తుపాకులు కలిగి ఉన్న వారిని ఏ ఫెడరల్ సంస్థ వెంటాడదు.... ఆ మాటలకు అనుగుణంగానే ఫ్లోరిడా ఘటన జరిగిన తరువాత తుపాకుల నియంత్రణ గురించి కాకుండా మానసిక సమస్యలను పరిష్కరిస్తాం... అని ఆయన మాట్లాడారు..
వాషింగ్టన్: ఫ్లోరిడా హైస్కూల్లో కాల్పుల ఘటన తర్వాత అమెరికాలో ఆయుధాల నియంత్రణపై చర్చ మళ్లీ మొదలైంది. ఫ్లోరిడా ఘటన అమెరికా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని విద్యార్థులు అంటున్నారు. ఆయుధాల నియంత్రణకు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వాషింగ్టన్లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు విద్యార్థులు ప్రకటించారు. ఆయుధాల నియంత్రణ చర్చలో ఫ్లోరిడా కాల్పుల ఘటన ఒక టర్నింగ్ పాయింట్‌గా మారాలని వారు అమెరికా మీడియాకు చెప్పారు. గత బుధవారం ఫ్లోరిడా స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల ఘటనలో 17 మంది చనిపోయారు. అదే స్కూల్‌కి చెందిన నికోలస్ క్రూజ్ అనే పూర్వ విద్యార్థి ఈ కాల్పులు జరిపాడు.
మార్చి 24న వాషింగ్టన్ వీధుల్లో నిరసన ర్యాలీలు...
మార్చి 24న స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ విద్యార్థులు వాషింగ్టలో నిరసన ర్యాలీలు చేపట్టబోతున్నారు. 'మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ క్యాంపేయిన్' పేరుతో నిరసనలు తెలపనున్నారు. అదే రోజు ఇతర నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నారు. శనివారం పార్క్లాండ్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కొందరు రాజకీయ నాయకులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు అమెరికా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంతాపం తెలిపితే సరిపోదు... చర్యలు తీసుకోండి
- ప్లోరిడా ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై తన కోపాన్ని వెళ్లగక్కింది. శక్తిమంతమైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ)తో సంబంధాలు ఉన్నందుకు ఎమ్మా గొంజాలెజ్ అనే విద్యార్థిని దేశ రాజకీయ నేతలను తీవ్రంగా విమర్శించింది.
- ''ఎన్ఆర్ఏ నుండి విరాళాలు స్వీకరించే ప్రతి రాజకీయ నేతను చూసి సిగ్గుపడుతున్నాను'' అని ఆ బాలిక పేర్కొంది. కాల్పుల ఘటనను నిరసిస్తూ ఫ్లోరిడాలో శనివారం చేపట్టిన తుపాకీ వ్యతిరేక ర్యాలీలో ఆమె పాల్గొంది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం ఎన్ఆర్ఏ నుండి లక్షలాది డాలర్లు విరాళంగా తీసుకున్నారంటూ బాలికతో పాటు ర్యాలీలో పాల్గొన్న వారు తీవ్రంగా ఆరోపించారు. ఎన్ఆర్ఏ నుంచి రాజకీయ నేతలు విరాళాలు తీసుకోవడం 'సిగ్గుచేటు' అంటూ గొంజాలెజ్‌తో పాటు వారంతా శ్రుతి కలిపారు.
- 'ప్రెసిడెంట్ ట్రంప్! ప్రజాప్రతినిధులు మీ నియంత్రణలో ఉన్నారు. సెనేట్ మీరు చెప్పినట్టు వింటోంది. అలాంటప్పుడు మీరు ఒక్క బిల్లు కూడా పాస్ చేయించలేరా?' అని టీవీ ఇంటర్వ్యూలో డేవిడ్ అనే మరో విద్యార్థి నిలదీశారు.
-'మా ప్రాణాలు పోతుంటే పెద్దోళ్లంతా చోద్యం చూస్తున్నారు' అని ఫ్లోరిడా కాల్పుల ఘటన నుంచి బయటపడిన కామెరాన్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం తెలిపితే సరిపోదు... చర్యలు తీసుకోండి అంటూ నిరసన కారులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్
ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) శక్తిమంతమైన సంస్థల్లో ఒకటి. అమెరికా దేశ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇందులో సభ్యుల సంఖ్య 50 లక్షలు. కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులు దీని వెనుక బలమైన శక్తులుగా ఉన్నారు. రాజకీయాల్లో తమ అనుకూల వర్గాలను అందలం ఎక్కించడం, వ్యతిరేకించే వారిని పాతాళానికి తొక్కడం ఈ కింగ్ మేకర్లకు వెన్నతో పెట్టిన విద్య.
తాము చెప్పినట్టు వినేలా ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల చేతులు తడుపుతోంది ఈ సంస్థ. 2016లో ఇందుకు సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేసింది. రాజకీయ ప్రచారాలకు దాదాపు రూ.322 కోట్లు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు రూ.193 కోట్లు వెచ్చించినట్టు అంచనా.
ఇలాంటి కార్యక్రమాల కోసం ఎన్ఆర్ఏ ఏడాదికి సుమారు రూ.1613 కోట్లు కేటాయిస్తుంది. ఆయుధాల నిరోధానికి బలమైన చట్టాలు తీసుకు రాకుండా మద్దతు పలికే సభ్యుల సంఖ్య చట్ట సభల్లో పెరుగుతూ ఉన్నంత కాలం ఎన్ఆర్ఏదే పై చేయిగా ఉంటుంది.