Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐన్‌స్టీన్‌తో సమానంగా సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త
- కృష్ణబిలాలు, బిగ్‌బాంగ్ సిద్ధాంతాలపై అద్భుత పరిశోధనలు
లండన్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బుధవారం కేంబ్రిడ్జ్‌లోని నివాసంలో హాకింగ్ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 1963 నుంచి నరాల సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో, ఆయన చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. కదలలేని స్థితిలో ఉండికూడా భౌతిక శాస్త్ర పరిశోధనలపై ప్రత్యేక దృష్టిపెట్టి వెలకట్టలేని పాత్ర పోషించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత భౌతిక శాస్త్రంలో అంత గొప్ప సేవలు అందించిన శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు. కృష్ణబిలాలు, బిగ్‌బాంగ్ సిద్ధాంతాలపై అద్భుత పరిశోధనలు చేపట్టి నేటి తరం శాస్త్రవేత్తలకు మార్గదర్శిగా నిలిచారు.గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి శాస్త్రజ్ఞులు చేపడుతున్న పరిశోధనలు మానవాళికి ముప్పుగా మారుతాయని పలుమార్లు హెచ్చరించారు. ఖగోళశాస్త్రంలో ఆయన చేపట్టిన పలు పరిశోధనలు పెను విప్లవం సృష్టించాయి. ఆయన రచించిన ఖబ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' బ్రిటిష్ సండే టైమ్స్‌లో 237 వారాలపాటు బెస్ట్ సెల్లర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఆయన రచించిన ఓ పుస్తకం కాలం కథ పేరుతో తెలుగులో కూడా వెలువడింది. 1988లో హాకింగ్ రచించిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ పుస్తకం రికార్డు స్థాయిలో కోటి కాపీలు అమ్ముడుపోయాయి. 35 భాషల్లోకి అనువాదం రూపంలో అందుబాటులోకి వచ్చింది. సైన్స్‌పై ఏమాత్రం అవగాహన లేని విద్యార్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో భౌతిక శాస్త్ర సూత్రాలను ఈ పుస్తకంలో హాకింగ్ వివరించారు. ఆయన 'థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్'.. గురుత్వాకర్షణ, బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం, కృష్ణబిలాల గురించి ప్రపంచానికి అర్థమయ్యేలా వివరించింది. ఇది ఎంతలా ఆదరణ పొందిందంటే.. 2014లో హాకింగ్ జీవితంపై రూపొందిన ఓ హాలివుడ్ చిత్రానికి దీన్నే టైటిల్‌గా ఎంచుకున్నారు. హాకింగ్ బాల్యం.. చక్రాల కుర్చీకే పరిమితమవడం, ఆయన చేపట్టిన ప్రముఖ పరిశోధనలు ఇలా అన్ని సన్నివేశాలను ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇక హాకింగ్ పలు టీవీషోల్లో అతిథిగా కనిపించి తన సిద్ధాంతాలను వివరించారు.
రెండేండ్లకే చనిపోతారని అనుకున్నారు...
హాకింగ్ ప్రమాదవశాత్తు మోటార్ న్యూరాన్ అనే నరాల సంబంధిత వ్యాధి బారినపడ్డారు. 21 ఏండ్ల వయసులోనే చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. 1963లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. అదే సమయంలో ఆయన ఓ రోజు మెట్ల మీద నుంచి కిందికి దొర్లిపడ్డారు. దీంతో, పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. హాకింగ్ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను సంప్రదించారు. మోటార్ న్యూరాన్ వ్యాధి వల్ల శరీరం నెమ్మదిగా పక్షవాతానికి గురవుతుందని వైద్యులు తెలిపారు. హాకింగ్ కేవలం రెండేండ్లు మాత్రమే బతుకుతారని చెప్పారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం కుంగిపోలేదు. అధైర్యపడకుండా మొక్కవోని ఆత్మసంకల్పంతో చక్రాల కుర్చీ నుంచే కదలలేని స్థితిలో ఉన్నా కూడా తన పరిశోధనలు, అధ్యయనాలను కొనసాగించారు. అయితే, ఆయన తిరిగి మాట్లాడటానికి మాత్రం కుదరలేదు. దీంతో, చేతితో సంజ్ఞలు చేసేవారు. తాను రూపొందించిన ఓ కమ్యూనికేషన్ డివైజ్ ద్వారా ఆయన సంజ్ఞలు అక్షర రూపంలోకి మారేవి. కొంతకాలం తర్వాత ఆ చేయి కూడా పక్షవాతానికి గురికావడంతో 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్ డివైజ్‌ను కంట్రోల్ చేశారు.
నోబెల్ దక్కలేదు :
హాకింగ్ తన పరిశోధనలతో ఖగోళ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అయితే, ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం మాత్రం ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బ్లాక్ హోల్స్ కెన్ డై అనే సిద్ధాంతానికి హాకింగ్‌కు నోబెల్ బహుమతి దక్కాల్సి ఉంది. దీన్ని అందరూ భౌతిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. అయితే, ఈ సిద్ధాంతాన్ని ధ్రువీకరించడానికి ఎలాంటి మార్గం కనిపించలేదు. అందుకే దీనికి నోబెల్ దక్కలేదని ప్రముఖ శాస్త్రవేత్త, 'సైన్స్ ఆఫ్ లిబర్టీ' రచయిత టిమోథీ ఫెర్రీస్ పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించగలిగితే ఆయనకు నోబెల్ పురస్కారం లభించేదని అన్నారు.
హాకింగ్ జీవిత విశేషాలు...
ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ నగరంలో 1942, జనవరి8న జన్మించారు. తండ్రి ఫ్రాంక్ వృత్తిరిత్యా వైద్యుడు. తల్లి ఇసోబెల్ హాకింగ్ తత్వవేత్త, ఆర్థికవేత్త. ఆయన తల్లిదండ్రులది ప్రేమ వివాహం. హాకింగ్‌కు ఓ సోదరి, ఇద్దరు సోదరులున్నారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నే 'హాకింగ్ రేడియేషన్' అని కూడా పిలుస్తారు. భౌతికశాస్త్రంపై పెద్దగా అవగాహన లేనివారికి కూడా ప్రాథమిక సిద్ధాంతాలు సులువుగా అర్థమయ్యేలా హాకింగ్ వివరించారు. విశ్వం ఎలా ఆవిర్భవించింది.. ఇది ఎలా పనిచేస్తుంది.. ఎప్పుడు అంతమవుతుంది? వంటి అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఆక్స్‌ఫర్డ్‌లోని సెయింట్ ఆల్బన్స్ హై స్కూల్లోనే సాగింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గణితశాస్త్రం చదవాలనుకున్నా అది సాధ్యం కాలేదు. సామాన్య శాస్త్రంలో విద్యనభ్యసించినట్టయితేనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన తండ్రి హాకింగ్‌ను మెడిసిన్ చదవాల్సిందిగా కోరారు. అయితే, ఆయన మాత్రం గణితశాస్త్రంపై కూడా ఆసక్తి చూపేవారు. అయితే, ఆ సమయంలో ఆక్స్‌ఫర్డ్‌లో గణితం చదవడం సాధ్యపడలేదు. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో భౌతిక,రసాయన శాస్త్రాల్లో రాణించాలనుకుని నిర్ణయించుకొని హాకింగ్ ఆ దిశగా అడుగులు వేశారు. అక్కడ మూడేండ్ల పాటు చదివిన ఆయన వెయ్యి గంటలు స్టడీ అవర్స్కే కేటాయించారట. ఆక్స్‌ఫర్డ్‌లో చదివేటప్పుడే కేంబ్రిడ్జ్‌లో పీహెచ్డీ కోసం ఓ పరీక్ష రాశారు. అయితే, అందులో ఆయనకు తక్కువ మార్కులు వచ్చాయి. కేంబ్రిడ్జ్‌లో చదవాలంటే ఆ పరీక్షలో కనీసం ఫస్ట్‌క్లాస్ రావాలి. కానీ, హాకింగ్‌కు మాత్రం ఫస్ట్‌క్లాస్‌కు సెకండ్ క్లాస్‌కు మధ్యలో వచ్చాయి. దీంతో ఆయనకు వైవా తప్పనిసరి అయింది. ఆ వైవాలో ఆయన తన హాస్యచతురతను ప్రదర్శించారు. ''మీరు నాకు ఫస్ట్ క్లాస్ ఇస్తే కేంబ్రిడ్జ్కు వెళతా...లేదంటే ఇక్కడే ఆక్స్‌ఫర్డ్‌లో ఉండిపోతా. కాబట్టి మీరు నాకు ఫస్ట్ క్లాస్ వేస్తారనే అనుకుంటున్నా'' అంటూ వైవా అధ్యాపకులతో చమత్కారాన్ని చూపించారు. కేంబ్రిడ్జ్‌లో 1966 నుంచి 1975 వరకు కాస్మాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ సమయంలోనే కృష్ణబిలాలు, గురుత్వాకర్షణ శక్తి, బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాలపై పలు పరిశోధనలు చేశారు. సారూప్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన పరిశోధనలకు అనేక అవార్డులు వరించాయి. కేంబ్రిడ్జిలో చదువుతున్న సమయంలో తన సోదరి స్నేహితురాలైన జేన్ వైల్డ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది. నరాల వ్యాధి రాకముందే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 1963లోనే ఆయనకు ఆ వ్యాధి సోకినా 1965, జులై 14న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి రాబర్ట్, లూసీ, తిమోతీ (ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె) జన్మించారు.
హాకింగ్ మృతిపై ప్రముఖుల సంతాపం : ప్రముఖ శాస్త్రవేత్త హాకింగ్ మృతిపై బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. స్టీఫెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచం ఓ అద్భుత శాస్త్రవేత్తను కోల్పోయిందంటూ పేర్కొన్నారు.