Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించొద్దని డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆరుగురు పార్లమెంట్ సభ్యులు ట్రంప్ సర్కార్ను డిమాండ్ చేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో హెచ్-1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములకు కూడా అమెరికాలో వర్క్ పర్మిట్ కల్పిస్తూ వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించి నిబంధనలు అలాగే ఉంచాలని సిలికాన్ వ్యాలీకి చెందిన డెమోక్రట్ నేతలు డిమాండ్ చేశారు. జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ హెచ్-4 వీసాతో ఎక్కువగా భారతీయులు లాభపడుతున్నారు. దాదాపు లక్ష మంది దీని ద్వారా వర్క్పర్మిట్ పొందారు. 2015లో ఒబామా దీనిని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు లక్ష మందికి పైగా హెచ్-4 వీసా ద్వారా పని అనుమతి పొందినట్టు సమాచారం. హెచ్-1బీ వీసాలు కలిగిన భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఉంచాలని కోరుతూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీకి తాజాగా లేఖ పంపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-4 వీసా విధానాన్ని రద్దు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ యంత్రాంగం తమ నిర్ణయంపై పునరాలోచించాలని డెమోక్రటిక్ పార్టీ నేతలు కోరారు. హెచ్-4 వీసాలపై నిర్ణయం తీసుకునేందుకు జూన్ వరకు సమయం కావాలని ఇటీవల కోర్టు విచారణలో హోంల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్మెంట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.