Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని గువాంగ్డాంగ్ హోంగ్డా అనే మైనింగ్ సంస్థ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఉత్తర చైనాలోని ఓ రహస్య ప్రాంతంలో సోమవారం గువాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ ఈ క్షిపణి పరీక్ష జరపగా, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్టు తేలిందంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెచ్డీ-1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు విక్రయించనుంది. గువాంగ్డాంగ్ హోంగ్డా మైనింగ్ కంపెనీని 1988లో స్థాపించారు. ఈ సంస్థ తాజాగా తయారు చేసిన హెచ్డీ-1 క్షిపణిని తక్కువ ఇంధనంతో నడిపించవచ్చు. దీని వేగం అధికంగా ఉంటుంది. వచ్చేనెలలో చైనాలో నిర్వహించనున్న వాయు విన్యాసాల్లో ఈ సరికొత్త క్షిపణిని ప్రదర్శనకు ఉంచనున్నట్టు గువాంగ్డాంగ్ హోంగ్డా మైనింగ్ కంపెనీ వెల్లడించింది.