Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుట్‌బాల్ గ్రౌండంత రెక్కలు..
- 2లక్షల కిలోల బరువు
వాషింగ్టన్ : ఏరోస్పేస్ విమానాల తయారీ సంస్థ స్ట్రాటోలాంచ్ తయారుచేసిన అతిపెద్ద విమానం విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని మొజావే విమానాశ్రయం నుంచి సరిగ్గా ఉదయం 6 గంటల 58 నిమిషాలకు తొలి టేకాఫ్ తీసుకుంది. గంటకు 274 కిలోమీటర్ల వేగంతో గగనతలంలో సందడి చేసింది. రెండున్నర గంటల సేపు నింగిలో చక్కర్లు కొట్టింది. మొజావే ఎడారి ప్రాంతంలో దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. 385 అడుగుల పొడవు, 238 అడుగుల వెడల్పుతో ఉండే రెక్కలు దీనికి ప్రధాన ఆకర్షణ. దీని రెక్కలు అమెరికా ఫుట్‌బాల్ గ్రాండ్‌కు సమానం. దీని బరువు 2లక్షల,26వేల, 800కిలోలు. ఈ విమానానికి రెండు ఫ్యూజ్‌లేజ్‌లు, ఆరు 747 జెట్ ఇంజిన్లు, 28 చక్రాలు ఉన్నాయి. తమ సంస్థ తయారు చేసిన విమానం గాల్లో విజయవంతంగా ఎగరడంతో స్ట్రాటోలాంచ్ సంస్థ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత బరువున్న అతిపెద్ద విమానం గాల్లోకి ఎగిరి రికార్డు సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 35 వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగరడం ఈ విమానం ప్రత్యేకత. 5 లక్షల పౌండ్ల బరువున్న శాటిలైట్లను సైతం నిర్ణీత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం దీని సొంతం కావడం విశేషం. దీని రూపకర్త మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్. రాకెట్ల ద్వారా శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు 2011లో ఆయన శ్రీకారం చుట్టారు. గతేడాది అక్టోబర్‌లో అలెన్ మృతి చెందారు.