Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థను కొంటామన్న టర్కీ
- ఎఫ్-35 ప్రాజెక్టుపై అమెరికా ఆందోళన
అంకారా : నాటో సభ్య దేశం టర్కీ అమెరికాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థ(ఎస్-400)ను కొనుగోలు చేయబోతున్నా మని టర్కీ కుండబద్దలు కొట్టింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదనీ భవిష్యత్తులో రష్యాతో కలిసి ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించు కుంటామనీ కరాఖండిగా చెప్పింది. ఈనేపథ్యంలో టర్కీతో సంబంధాలు సమస్యాత్మక దశకు చేరుకున్నా యని అమెరికా వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
ఇస్తాంబుల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు తైయిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ...''రష్యా నుంచి ఎస్-400 కొనడం ఎప్పుడో ఖాయమై పోయింది. భవిష్యత్తులో కూడా రష్యాతో కలిసి ఎస్-500 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తయారుచేస్తా''మని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టర్కీపై అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. నాటో దేశమైన టర్కీ, రష్యాతో ఇంతటి కీలకమైన ఓ రక్షణ ఒప్పందాన్ని చేసుకోవటంపై అమెరికా గుర్రుగా ఉంది. టర్కీకి సామ, దాన, భేద దండోపాయాలతో నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది.
ఎఫ్-35 కార్యక్రమం నుంచి తప్పిస్తాం : అమెరికా
అమెరికాతో సహా కలిసి తొమ్మిది దేశాలు చేపట్టిన ఎఫ్-35 యుద్ధవిమానాల తయారీలో టర్కీ కూడా ఒకటి. దాదాపు 25ఏండ్ల నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తోంది. టర్కీ 100 ఎఫ్-35 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భావి స్తోంది. అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టు ఎఫ్-35దే. దీంతో ఈ విమానాల ను ఎంత ఎక్కువగా విక్రయిస్తే అంత ప్రాజెక్టు ఖర్చు కలిసివస్తుంది. ఇప్పుడు రష్యాకు చెందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ, ఎఫ్-35 యుద్ధవిమానాలను టర్కీ ఒకేసారి వినియోగించే పరిస్థితి తలెత్తింది.
దీంతో ఎఫ్-35కు ఉండే అతిస్వల్ప రాడార్ సిగెచర్ను ఎస్-400 రాడార్లు గుర్తించడం మొదలుపెడితే అవి రష్యాకు చేరే ప్రమాదం ఉంది. అదే జరిగితే రష్యా ఎఫ్-35లను గుర్తించే విధంగా రాడార్లను అభివృద్ధి చేస్తుంది. అప్పుడు ఎఫ్-35 ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లువుతుంది. అందుకే టర్కీపై అమెరికా విపరీతమైన ఒత్తిడి తెస్తోంది. కానీ, ఎఫ్-35 రాడార్ సిగెచర్లు ఎస్-400కు చేరకుండా చర్యలు తీసుకుంటామని టర్కీ చెబుతున్నా ఇది దాదాపు అసాధ్యం. అందుకే టర్కీకి ఎఫ్-35లను ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. కాకపోతే భవిష్యత్తు లోనైనా ఎఫ్-35లను దక్కించుకొంటామని టర్కీ ధీమాగా చెబుతోంది.
ఎస్-400పై అనేక దేశాలకు ఆసక్తి
రష్యా తయారు చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అమెరికా మిత్ర, శత్రుదేశాలు ఈ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి. భారత్ సైతం రష్యాతో ఈ ఒప్పందాన్ని చేసుకుంది. చైనా ఇప్పటికే కొన్ని ఎస్-400 కొనుగోలు చేసింది. తాజాగా ఇరాక్ కూడా ఈ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. సౌదీ అరేబియా, ఈజిప్ట్, వియత్నాం దేశాలు తమ ఆసక్తిని ప్రకటించాయి.