Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవావరణం, జంతువులు ఎక్కువగా ఉన్నచోట అనేక భాషలు
- ఆహార దిగుబడి, పర్యావరణంతో ప్రభావితం
- తాజా అధ్యయనంలో వెల్లడి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు విస్తరించిన తీరు భాషా శాస్త్రవేత్తల్ని ఆలోచింపజేస్తోంది. భిన్నమైన భాషలు ఒక ప్రాంతంలో, ఒక దేశంలో విస్తరించడానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిశోధనే తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఒక ప్రాంతంలోని జీవావరణం, వాతావరణం అక్కడి భాషల మనుగడను, భిన్నత్వాన్ని నిర్దేశిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. భౌగోళిక పరిస్థితులకన్నా, వాతావరణ పరిస్థితులే భిన్నమైన భాషల పుట్టుకకు కారణమని ఈ పరిశోధన తేల్చింది. 'నాచుర్ కమ్యూనికేషన్'లో ప్రచురితమైన ఈ పరిశోధనా వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి...
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్యూ) బయాలజిస్ట్, ప్రొఫెసర్ లిండెల్ బ్రోహమ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ప్రపంచవ్యాప్తంగా భాషలు విస్తరించిన తీరును అధ్యయనం చేసింది. వాతావరణ పరిస్థితులు ఆహార దిగుబడులను నిర్ణయిస్తాయి కాబట్టి, ఆ ప్రాంత వాసుల భాషలోని భిన్నత్వానికి ఆహారం కారణమవుతోందని పరిశోధకులు భావించారు. ఏ ప్రాంతంలోనైతే పెద్ద మొత్తంలో ఆహారం ఉత్పత్తి అవుతుందో, అక్కడ భిన్నమైన భాషా సంస్కృ తులు ఏర్పడతాయనీ, అనేక భాషలు సైతం పుట్టుకొస్తాయనీ ప్రొఫెసర్ లిండెల్ అన్నారు. ఒక ప్రాంతంలో నివసించే ప్రజా సమూహం స్థిరమైన జీవనాన్ని కొనసాగించాలంటే వాతావరణం అనుకూలించాలి. ఆహార పంటల ఉత్పత్తి ఏ దేశాల్లో ఎక్కువగా ఉందో, ఆ దేశాల్లో ఎక్కువ సంఖ్యలో భిన్నమైన భాషలు ఆవిర్భవించాయి.
''జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నచోట పెద్ద సంఖ్యలో భాషలు మనుగడలో ఉన్నాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే జంతుజాలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ సంఖ్యలో భాషలు మనుగడ సాగిస్తున్నాయి. ఒకవేళ జంతువులు జీవించే వాతావరణం లేనట్టయితే, అది మనుషుల జీవనాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి చోట ప్రజల జీవన సమూహాలు చాలా చిన్నవిగా ఉంటాయి. తద్వారా చాలా తక్కువ సంఖ్యలో భాషలు మనుగడలో ఉన్నట్టు మా అధ్యయనం చెబుతోంది''అని ప్రొఫెసర్ లిండెల్ బ్రోహమ్ చెప్పారు.
ఇక్కడ అలా లేదు..ఎందుకో?
ప్రపంచ విస్తీర్ణంలో 'పపువా న్యూగినియా'ది కేవలం 0.5శాతం మాత్రమే. కానీ ఇక్కడ ఎన్నో భిన్నమైన భాషలు ఏర్పడ్డాయి. ప్రపంచ భాషల్లో 10శాతం ఇక్కడ ఉండటం గమనార్హం. ఇందులో ఒక భాష మరొక భాషకు మధ్య పోలిక లేదు. అలాగే తూర్పు హిమాలయ పర్వతాలు, పశ్చిమ ఆఫ్రికాలోనూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నివసించే జనాభా తక్కువ. ఆహార పంటల ఉత్పత్తి తక్కువ. కానీ భిన్నమైన భాషలు మనుగడలో ఉన్నాయి. ముందు చెప్పినట్టుగా వాతావరణం, జీవావరణం ఆధారంగా ఇక్కడ ఓ నిర్ణయానికి రాలేమని అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్ జియా హు అన్నారు.