Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ప్రదేశాల్లో లైంగికదాడుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు :ఐఎల్ఓ
జెనీవా : పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగికదాడుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ ( ఐఎల్ఓ) వెల్లడించింది. పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగికదాడి, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టయితే సదరు సంస్థ యజమానినే బాధ్యులను చేసే విధంగా నిబంధనలు రూపొందించనున్నట్టు ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఆఫ్రికా దేశాల్లో లైంగికదాడుల ఘటనలు బాగా పెరిగిపోయాయని అన్నారు. ఇకపై ఎల్జీబీటీఐ( లెస్బియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్లు, ఇంటర్సెక్సువల్స్)లపై ఎలాంటి లైంగికదాడులు, హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నా సదరు సంస్థ నిర్వాహకులనే బాధ్యుల్ని చేసేలా చట్టాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు రైడర్ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదన పట్ల ఆఫ్రికా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని అన్నారు. ఐఎల్ఓ ఆవిర్భవించి నూరేండ్లు పూర్తయిన సందర్భంగా వచ్చేనెల 10 నుంచి 21 వరకు 2చేపడతామని అన్నారు. ఈమేరకు వచ్చేనెలలో ఐరాస సభ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరేలా చూస్తామని అన్నారు. కాగా, పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగికదాడి, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టయితే దీనికి యజమానినే బాధ్యుల్ని చేయాలని ఐఎల్ఓ ప్రతిపాదించిన నిబంధనను పలు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనట్టయితే తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి తాము బెదిరింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన చెందుతున్నారు. ఐఎల్ఓ ప్రతిపాదించిన నిబంధనలు యజమానుల హక్కులను కాలరాసేలా ఉన్నాయంటూ విమర్శించాయి.