Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష పార్టీ మహిళా నేతకూ చోటు
- రికార్డు సృష్టించిన నూతన అధ్యక్షుడు సిరిల్
ప్రిటోరియా : దక్షిణ ఆఫ్రికా నూతన అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా సరికొత్త రికార్డు సృష్టించారు. తన క్యాబినెట్లో 50శాతం మంత్రి పదవులను మహిళలకు కేటాయించి మహిళా సాధికారతను కనబరిచారు. దక్షిణ ఆఫ్రికా చరిత్రలో మంత్రి పదవుల్లో సగభాగం మహిళలకు కేటాయించడం ఇదే తొలిసారి. అంతేగాకుండా, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ మహిళా నేతకు మంత్రి పదవి కేటాయించి సిరిల్ సరికొత్త చరిత్రకు నాంది పలికారు. కేప్‌టౌన్ మాజీ మేయర్, ప్రతిపక్ష గుడ్ పార్టీకి చెందిన నేత పాట్రీసియా డె లిల్లేకు కూడా మంత్రి పదవి కేటాయించి మహిళలపై ఆయనకు ఉన్న గౌరవాన్ని, అపార నమ్మకాన్ని చాటుకోవడం గమనార్హం. తాను ఎంపిక చేసిన మంత్రులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తారని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత సిరిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 36 మంది ఉన్న మంత్రుల సంఖ్యను 28కి తగ్గించారు. సిరిల్ క్యాబినేట్లో మంత్రి పదవులు పొందిన వారిలో ఇద్దరు ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. ఐదేండ్ల పాటు అధ్యక్ష పదవిలో సిరిల్ కొనసాగనున్నారు. కాగా, దక్షిణ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవనం నిర్మించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈనేపథ్యంలో ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడి మేరకు జాకబ్ జుమా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈనెల8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సిరిల్ రమాఫోసా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన సిరిల్ గత క్యాబినెట్‌లోని పలువురు మంత్రులను యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రిగా టిటోబొవేమి, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రిగా ప్రవీణ్ గోర్ధాన్ కొనసాగుతారని వెల్లడించారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జెఫ్ రాదేబ్కు ఏ శాఖను కూడా కేటాయించలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ మబూజను ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇథియోపియా ప్రధాని అబీఅహ్మద్ కూడా తన క్యాబినేట్లో సగం మంది మహిళలకు మంత్రి పదవులు కేటాయించారు. రవాండ దేశం కూడా క్యాబినేట్లో మహిళలకు సముచిత స్థానం కల్పించింది.