Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాయిలెట్ అనుకుని ఎమర్జెన్సీ డోర్ తెరిచిన మహిళ
- ఒక్కసారిగా తెరుచుకున్న ఎయిర్ బ్యాగులు
ఇస్లామాబాద్ : ఓ మహిళ టాయిలెట్ డోర్ అనుకొని విమానం అత్యవసర ద్వారాన్ని తెరవడంతో పాక్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కొత్తగా విమాన ప్రయాణాలు చేసేవారు తెలిసిన వారి సాయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీ నుంచి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వస్తున్న విమానంలో ఓ మహిళ చేసిన పని తీవ్ర ఆందోళన కలిగించింది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రన్ వేపై వేగం అందుకుంటుండగా ఓ మహిళ తన సీట్లోంచి హడావుడిగా లేచింది. నేరుగా వెళ్లి ఎమర్జెన్సీ డోర్ తీసింది. టేకాఫ్ తీసుకుంటున్న విమానం తలుపు తెరుచుకోవడంతో వార్నింగ్ అలారం మోగింది. ముందుజాగ్రత్తగా ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. ఇక విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక హడలిపోయారు. దీంతో, విమానాన్ని సిబ్బంది నిలిపివేసి ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లాంజ్‌లోకి పంపారు. ఇక, ఆ మహిళను ప్రశ్నించగా, తాను టాయిలెట్‌కు వెళ్లాలనుకుని డోర్ తెరిచానని, అది ఎమర్జెన్సీ డోర్ అనుకోలేదని తెలిపింది. ఏదైతేనేమి, ఆ మహిళ చేసిన పనికి పీఐఏ విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.