Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పార్లమెంట్ భవనం ముట్టడికి నిరసనకారుల విఫలయత్నం
- బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు
బీజింగ్: హాంగ్‌కాంగ్‌లో నిరసనలు మిన్నంటాయి. నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలని హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌లో నేరారోపణలు ఎదుర్కొంటున్న పౌరుల విచారణ చైనా న్యాయస్థానాల్లో చేపట్టాలనే అంశంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నది. నిందితులను చైనాకు అప్పగించడమే మేలంటూ మెజారిటీ పౌరులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, తమ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కారులు నల్లటి దుస్తులు ధరించి హాంగ్‌కాంగ్ వీధుల్లో బుధవారం నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను ఎట్టిపరిస్థితుల్లో చైనాకు అప్పగించొద్దని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పార్లమెంట్ భవనం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చట్టసభ సభ్యులెవరూ పార్లమెంట్ భవనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు బల ప్రయోగం చేపట్టారు. బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. పార్లమెంట్ భవనంలోకి నిరసనకారులు ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆందోళనల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన హాంగ్‌కాంగ్ శాసనసభ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో ఎక్స్ట్రాడీషన్ బిల్లుపై జరగాల్సిన చర్చ వాయిదా పడింది.
అంబ్రెల్లా మూమెంట్...
హాంగ్‌కాంగ్‌లో నేరాలకు పాల్పడ్డవారిని చైనాకు అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా శాంతియుత నిరస నలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఎక్కువగా ఆ దేశ యువత పాల్గొంటోంది. ఆందోళనకారులు గొడుగులను ఆయు ధాలుగా చేసుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమను అడ్డుకున్న వారికి గొడుగులు చూపిస్తు న్నారు. 2014లో హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్య నిరసనల్లో భాగంగా నిర్వహించిన ''అంబ్రెల్లా మూమెంట్'' తర్వాత ఆ స్థాయిలో మళ్లీ నిరసనలు చెలరేగడం ఇదే ప్రథమం.
ఎందుకీ బిల్లు?
హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి.. గర్భవతి అయిన తన ప్రియురాలిని తీసుకుని గతేడాది ఫిబ్రవరిలో తైవాన్ వెళ్లాడు. అక్కడ ఆమెను అతడు హత్య చేసి, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి హాంగ్‌కాంగ్ వచ్చేశాడు. అందుకే అతడిని తమకు అప్ప గించాలని తైవాన్ కోరింది. అయితే, నేరస్తుల అప్పగింతపై తైవాన్‌తో సరైన ఒప్పందాలు లేక హాంగ్‌కాంగ్ ఇందుకు నిరాకరించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు హాంగ్‌కాంగ్ స్వతంత్ర న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా ఉందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ బిల్లు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.