Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిన్నరపాటు రహస్య స్థావరంలో
- అల్ బాగ్దాదీ వికృత క్రీడ
- బాధితురాలి కుటుంబసభ్యుల ఆరోపణ
వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ అగ్రనేత అబూబకర్ అల్ బాగ్దాదీ తన వద్ద బందీగా ఉన్న అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త కారులా మ్యూలర్పై లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యానికి తనను తాను ఖలీఫాగా ప్రచారం చేసుకున్న అబూబకర్ తమ కుమార్తెను లైంగికంగా వేధించాడంటూ స్వయంగా మ్యూలర్ తల్లిదండ్రులు,బంధువులు మీడియా ముందు వెల్లడించారు. 2013 ఆగస్టు 4న సిరియాలోని అలెప్పోలో స్వానిష్ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ నిర్వహిస్తున్న హాస్పటల్ నుంచి బయటకు వచ్చిన మ్యూలర్‌ను ఐఎస్ తీవ్రవాదులు అపహరించారు. ఆ తర్వాత ఆమె చనిపోయేంత వరకూ దాదాపు ఏడాదిన్నరపాటు సిరియాలోని ఓ రహస్య స్థావరంలో బందీగా ఉంది. అది ఐఎస్ మద్దతుదారు, ట్యునీషియా ఆయిల్ వ్యాపారి అబూ సయ్యఫ్ కుటుంబ పర్యవేక్షణలో ఉన్న స్థావరం. అక్కడే ఐఎస్ అగ్రనేత అబూబకర్ నివాసముండేవాడని చెబుతున్నారు. మ్యూలర్పై మనసుపడ్డ అబూబకర్ ఆమెను తన కోసమే కిడ్నాప్ చేయించినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. ఆమెను బెదిరించి లంగదీసుకున్నట్టుగా అదే స్థావరంలో కొంతకాలంపాటు బందీలుగా ఉన్న ఇద్దరు యేజ్దీ(కుర్దు తెగ) యువతులు నిర్ధారించారు. వీరు ఐఎస్ బారి నుంచి బయటపడ్డ తర్వాత తీవ్రవాదుల లైంగిక వేధింపుల గురించి తమకు వివరించినట్టు అమెరికా సైనికాధికారులు తెలిపారు. తమకు బందీలుగా చిక్కిన మహిళలను బానిసలుగా భావిస్తారని వారు వెల్లడించారు. అబూ సయ్యఫ్ భార్య ఉమ్మా సయ్యఫ్ కూడా అబూబకర్‌పై ఆరోపణలకు సాక్ష్యంగా నిలిచింది. మ్యూలర్‌ను తన సొంత ఆస్తిలా వాడుకున్నాడని అమెరికా అధికారుల విచారణలో స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 16న అమెరికా సైన్యం అబూసయ్యఫ్ నివాసంపై దాడి జరిపినపుడు ఉమ్మా పట్టుబడింది. ఐతే,బందీలందరినీ సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించగా అబూసయ్యఫ్ కాల్పులకు ప్రయత్నించడంతో అతన్ని చంపేశామని అమెరికా సైనికులు తెలిపారు. అతని భార్య ఉమ్మాను విచారణ తర్వాత కుర్దూ అధికారులకు అప్పగించినట్టు అమెరికా తెలిపింది. ఈ దాడికి ముందు ఫిబ్రవరిలో జోర్డాన్ వైమానిక దాడిలో మ్యూలర్ మరణించినట్టు ఐఎస్ ప్రకటించింది. ఈ వార్తను అమెరికా ఆ తర్వాత ధృవీకరించింది.
మ్యూలర్ 27వ పుట్టినరోజు(ఆగస్టు 14) సందర్భంగా కుటుంబసభ్యులు ఆమె జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. బందీగా ఉన్న సమయంలో(2014) అరిజోనాలోని ఆమె కుటుంబసభ్యులకు మ్యూలర్ ఓ లెటర్ రాశారు. అందులో తనకు ప్రమాదమేమీలేదని, తీవ్రవాదులు తనను గౌరవంగా దయతో చూస్తున్నారంటూ మ్యూలర్ పేర్కొన్నారు. ఐతే, తమకు నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారంలో మ్యూలర్ ఐఎస్‌కు అనుకూలంగా మారారనీ, అబూబకర్‌కు భార్యగా వ్యవహరిస్తోందంటూ అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ సమయంలో తాము ఎంతో బాధ పడ్డామని మ్యూలర్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ''ప్రతిదీ ఓ కారణం కోసమే జరుగుతుంది, ఏదీ విచారించదగింది కాదు, ఇతరుల నుంచి నీవు ఎప్పటికీ నేర్చుకోవాల్సిందే'' అంటూ మ్యూలర్ పంపిన సందేశాన్ని ఆమె కుటుంబసభ్యులు గుర్తు చేశారు.