Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు
- జాత్యహంకార భావాలు ప్రదర్శిస్తున్నారనే విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు కాంగ్రెస్ మహిళా సభ్యులను విమర్శిస్తూ ట్విటర్లో ట్రంప్ చేసిన ట్వీట్స్ పెను దుమారం రేపుతు న్నాయి. 'యూఎస్ కాంగ్రెస్‌లోని నలుగురు మహిళా సభ్యులు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైన, అత్యంత అవినీతిమయమైన దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. వీరంతా ఎక్కడ నుంచి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్లిపోవాలి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతే గాకుండా, ఈ మహిళలు తిరిగి వెళ్లిపోయేందుకు ప్రతి నిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఉచితంగా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని ట్విట్టర్లో కోరారు.
నల్లజాతీయులైన ఈ నలుగురు కాంగ్రెస్ సభ్యులు, స్పీకర్ పెలోసీ మధ్య ఘర్షణ తర్వాత వారం రోజులకు ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురు కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, రషీదా త్లాయిబ్, అయన్నా ప్రెస్లీ అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఇల్హాన్ ఒమర్ బాల్యంలో ఉండగా అమెరికాకు వచ్చారు. ట్రంప్ జన్మించిన క్వీన్స్ ఆస్పత్రికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో న్యూయార్క్ నగరంలోని బ్రోన్స్క్ ప్రాంతంలో ఒకాసియో-కోర్టెజ్ జన్మించారు.
తనపై, అమెరికాపై ఈ నలుగురు మహిళలు విమర్శలు చేస్తున్నారని ట్రంప్ తన ట్వీట్లలో ఆరోపించారు. పూర్తిగా విఫలమైన, అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వా లున్న దేశాల నుంచి వచ్చిన ఈ నలుగురు డెమోక్రాట్స్ కాంగ్రెస్ మహిళా సభ్యులు ప్రపంచంలోనే మహౌన్నత మైన, అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికాలో ప్రభుత్వం ఎలా నడవాలో ప్రజలకు చెబుతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు.
'వారు ఏ దేశాల నుంచి వచ్చారో అవి కకావికలమై ఉన్నాయి, నేరాలతో కునారిల్లు తున్నాయి. వారు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి ఆ దేశాలకు వెళ్లి ఆ సమస్యల పరిష్కారంలో సాయపడొచ్చు కదా... ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎలా చేయాలో చెప్పొచ్చు కదా' అని ట్రంప్ వ్యాఖ్యా నించారు. నలుగురి పేర్లు ప్రస్తావించకుండానే అమెరికా అధ్యక్షుడు ఈ విమర్శలు చేశారు. స్పీకర్ పెలోసీ ప్రస్తావన తీసుకురావడంతో ఆయన ఈ నలుగురి గురించే అంటున్నారనే విషయం స్పష్టమైపోయింది.
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తప్పుపట్టిన స్పీకర్
ఇతర దేశస్థులు, ఇతర దేశాల మూలాలున్నవారి పట్ల ఎలాంటి ప్రాతిపదికలేని అపోహలు ట్రంప్ ట్వీట్లలో ఉన్నాయని ఆమె ఆక్షేపించారు. 'భిన్నత్వమే అమెరికా బలం.. ఐకమత్యమే అమెరికా శక్తి' అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్‌ను అభిశంసిం చాలని రషీదా త్లాయిబ్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ' దేశంలో అవినీతిని పారదోలేందుకు నేను కృషి చేస్తున్నాను. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయం' అని రషీదా ట్వీట్ చేశారు. ట్రంపే ఒక సంక్షోభమని, ఆయన భావజాలం ప్రమాదకరమైనదని, అదో సంక్షోభమని ఆమె విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థత్వానికి పోటీలో ముందువరుసలో ఉన్న బెర్నీ శాండర్స్ స్పందిస్తూ- ట్రంప్ జాతివివక్షతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ట్రంప్‌లో జాత్యహంకార భావాలు
ట్రంప్‌లో జాత్యహంకార భావాలున్నాయని బ్రిటన్ ప్రధాని థెరిసా మే విమర్శించారు. యూఎస్ కాంగ్రెస్ మహిళా సభ్యులను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని అన్నారు. మహిళల పట్ల ట్రంప్‌నకు గౌరవభావం లేదని విమర్శించారు.