Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: హాంగ్‌కాంగ్‌లో కొనసాగుతున్న నిరసనల వెనుక అమెరికా హస్తముందని చైనా పేర్కొంది. హాంగ్‌కాంగ్ అల్లర్లకు అమెరికా మద్దతిస్తూ చైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నిందని తెలిపింది. హాంగ్‌కాంగ్‌లో చెలరేగిన నిరసనల అంశంపై చైనా సరైన నిర్ణయం తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్పాంపియో చేసిన వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని తెలిపింది. హాంగ్‌కాంగ్‌లో నిరసనలకు ఆజ్యం పోసేందుకు కుట్ర పన్నిందని తెలిపింది.
హాంగ్‌కాంగ్ నిరసన కార్యక్రమాల్లో అమెరికన్లు పాల్గొంటున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చుయింగ్ తెలిపారు. చైనా అభివృద్ధికి ఆటంకం కలిగించడం కోసం పాశ్చాత్య దేశాలు హాంగ్‌కాంగ్ నిరసనల రూపంలో కుట్రలు పన్నుతున్నాయని చుయింగ్ మండిపడ్డారు. ఈ ఆందోళనలు, విమర్శలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అదంతా హాంగ్‌కాంగ్ ప్రభుత్వ ప్రతిపాదనను రాజకీయం చేయటానికి, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నమని తెలిపింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న హాంగ్‌కాంగ్ పౌరులను విచారణ నిమిత్తం చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలల కిందట ఆందోళనలు మొదలయ్యాయి. బిల్లును నిలిపివేస్తున్నట్టు హాంగ్‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ప్రకటించినా... ప్రజలు వెనక్కి తగ్గడంలేదు. బిల్లును పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు కొనసాగిస్తున్నారు.