Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోండ్యూరస్లో నిరసనలు
- అధ్యక్షుడు ఓర్లాండోకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు... ఆందోళనకారుల ఆరోపణ
టెగూసిగల్ప : హౌండ్యూరస్లో నిరసనలు మిన్నంటాయి. అధ్యక్ష పదవికి జువాన్ ఓర్లాండో రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు కదం తొక్కారు. ప్రజా సంక్షేమాన్ని ఓర్లాండో విస్మరించడమే కాకుండా నియంతలా వ్యవహరిస్తున్నారంటూ నినదించారు. నిరసనకారులు 'ఈ నియంత పాలన మాకొద్దు...ఓర్లాండో తక్షణమే రాజీనామా చేయాలి' అని ముద్రించిన బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. హౌండ్యూరస్ నగర వీధుల్లో భారీ ర్యాలీ తీశారు. ఓర్లాండ్కో వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. తమ దేశాధ్యక్షుడికి డ్రగ్స్ మాఫియాతో, అక్రమ ఫైనాన్స్ కంపెనీలతో సంబంధాలున్నాయని నిరసనకారులు విమర్శించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుండటంతో యువత పెడతారిన పడుతున్నారని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశాధ్యక్షుడికే డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న నేపథ్యంలో మాదకద్రవ్యాల సరఫరాదారులపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. అంతేగాకుండా, పలు ఫైనాన్స్ కంపెనీలు ప్రజలను ముక్కుపిండి మరీ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నప్పటికీ అధ్యక్షుడు ఆ సంస్థలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. హౌండ్యూరస్లోని అన్ని ముఠాలతో దేశాధ్యక్షుడికి సంబంధాలున్నాయని నిరసనకారులు ఆరోపించారు. కాగా, గతేడాది నవంబర్‌లో ఓర్లాండో సోదరుడు జువాన్ ఆండోనియా అమెరికాకు కొకైన్ సరఫరా చేస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఓర్లాండో రాజీనామాపై ప్రజలు ఒత్తిడి పెంచారు. ఇదిలా ఉండగా, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్మాఫియాపై ఉక్కుపాదం మోపానని ఓర్లాండో తెలిపారు.
డ్రగ్స్మాఫియా గ్రూపుకు చెందిన సభ్యులే తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. మెజారిటీ పౌరుల మద్దతు తనకే ఉందని అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని అన్నారు.