Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా క్షిపణి పరీక్షలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. 1987నాటి మధ్యశ్రేణి అణ్వాయుధ ప్రయోగ నిషేధ ఒప్పందం (ఐఎన్ఎఫ్) నుంచి ఈనెల2న అమెరికా వైదొలిగింది. ఆ ఒప్పందం నిషేధించిన క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంతి సెర్గీ ర్యాబ్కోవ్ తెలిపారు.
అమెరికా చర్యలు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించేలా ఉన్నాయని విమర్శించారు. కాగా, సంప్రదాయక పద్ధతుల్లో రూపొందించిన ఈ క్షిపణిని కాలిఫోర్నియాలోని శాన్ నికొలస్ దీవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించినట్టు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. 500 కి.మీ దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించిందని పేర్కొంది. ఇది తాము సంప్రదాయకంగా యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే తోమహాక్ క్షిపణేనని పెంటగాన్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రాబర్ట్ కార్వర్ వివరించారు. ఈ క్షిపణి ప్రయోగంలో మార్క్-41 వర్టికల్ లాంచింగ్ సిస్టమ్ (వీఎల్ఎస్)ను వినియోగించటం ప్రాధాన్యత సంతరిం చుకుంది. అమెరికా ఇటువంటి క్షిపణి ప్రయోగ వ్యవస్థలనే పోలండ్, రుమేనియా వంటి దేశాలలోని తన స్థావరాలలో సిద్ధంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ స్థావరాలలో వీఎల్ఎస్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచటం ఐరోపా దేశాలకు ముప్పుగా పరిణమిస్తోందని, ఇది ఐఎన్ఎఫ్కు విరుద్ధమని రష్యా దీర్ఘకాలంగా వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థల నుంచి తోమహాక్ క్షిపణులతో పాటు ఆధునికమైన ఎస్ఎం-3 క్షిపణులను కూడా ప్రయోగించే వెసులుబాటు ఉండటమే ఇందుకు కారణం. 500-5,500 కి.మీ మధ్య శ్రేణి ఆయుధాలను 1987 నాటి ఈ ఒప్పందం నిషేధించిన విషయం తెలిసిందే.
రష్యా ఈ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఒప్పందం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తాము కూడా ఈ ఒప్పందం నుండి వైదొలగుతున్నట్టు రష్యా ప్రకటించటంతో ఈ ఒప్పం దానికి ఈ నెల1తో కాలం చెల్లింది. ఇదిలాఉండగా, 1987 లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, సోవియట్ జనరల్ సెక్రెటరీ మైఖెల్ గోర్బచేవ్ మధ్య ఐఎన్ఎఫ్ ఒప్పందం కుది రింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యమున్న అణ్వస్త్ర, క్షిపణి పరీక్షల ప్రయోగాలను నిర్వహించకూడదు.