Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్: గృహ హింస, లైంగిక వేధింపులకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నా రాజకీయ నాయకత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం, మీడియా కూడా వీటిని అంతగా పట్టించుకోకపోవడంతో స్పానిష్ నారీ లోకం దీనిపై శుక్రవారం దేశ వ్యాపిత నిరసనలకు దిగింది. లింగ ఆధారిత హింసపై అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఈ వేసవిలో మాజీ జీవిత భాగస్వాముల చేతిలో 19 మంది మహిళలు చనిపోయారు. అత్యాచారాల పరంపర యథేచ్ఛగా సాగిపోతోంది. 2003 నుంచి ఇప్పటివరకు గృహ హింస బారిన పడి 1,017 మంది మహిళలు చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు 42 మంది మహిళలు హత్యకు గురయ్యారని స్పానిష్ ప్రభుత్వం వెల్లడించిన లెక్కలే చెబుతున్నాయి. ఈ నిరసనలకు సారథ్యం వహించిన ఎమర్జెన్సియా ఫెమినిస్టా (ఫెమినిస్టు ఎమర్జన్సీ) ఒక ప్రకటన చేస్తూ గత దశాబ్దంలో ఎన్నడూ లేని రీతిలో ఈ వేసవిలో మహిళలపై హింసాత్మక దాడులు పెరిగి పోయాయని తెలిపింది.