Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1,634 కోట్ల లోటు బడ్జెట్ : గుటేరస్
న్యూయార్క్: ఐక్కరాజ్యసమితి ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బందులు పడుతోందని సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ తెలిపారు.230 మిలియన్ డాలర్ల (రూ.1,634 కోట్లు) లోటు బడ్జెట్‌తో ఉన్న ఐరాస ఖజానా అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశముందని అన్నారు. ఐరాసలో ఉద్యోగం చేస్తున్న 37 వేల మందిని ఉద్దేశించి ఆయన ఈమేరకు ఓ లేఖ రాశారు. ఈ ఏడాది బడ్జెట్‌కు సంబంధించి 70 శాతం మాత్రమే సభ్య దేశాలు చెల్లించాయని అన్నారు. ఫలితంగా సెప్టెంబర్ నెలాఖరుకు 230 మిలియన్ డాలర్ల లోటు బడ్జెట్ ఏర్పడిందని అన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగినట్టయితే నిల్వ సొమ్ము మొత్తం అక్టోబరు చివరి నాటికి పూర్తిగా అయిపోతుందని గుటేరస్ తన లేఖలో వివరించారు. నిధుల కొరత దృష్ట్యా పొదుపు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అన్నారు. సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆదేశించారు. అధికారిక ప్రయాణాలను అవసరమైన వాటికి మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. నిధులు పెంచాలని కొంతకాలం కిందటే సభ్య దేశాలను గుటేరస్ కోరారని ఐరాస అధికారి ఒకరు వెల్లడించారు. అయి తే, అందుకు సభ్య దేశాలు నిరాకరించినట్టు చెప్పారు. 2018-19లో ఐరాస నిర్వహణ వ్యయం 5.4 బిలియన్ డాలర్లు( రూ.38,385 కోట్లు). దీనిలో 22 శాతం నిధులు మాత్రమే అమెరికా ద్వారా వచ్చినట్టు పేర్కొంది.