Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనిక తిరుగుబాటులో గులెన్కు సహకరించారనే ఆరోపణలపై
అంకారా : టర్కీ ప్రభుత్వం మరో 176 మంది సైనికులను అరెస్ట్ చేయాలని మంగళవారం ఆదేశించింది. అరెస్టయిన నిందితులంతా టర్కీలో సైనిక తిరుగుబాటు చెలరేగిన సమయంలో పెన్సిల్వేనియాలో ప్రవాసముంటున్న ఇస్లాం మతగురువు గులెన్కు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని ప్రత్యేక న్యాయస్థానంలో విచారించనున్నారు. నిందితులపై మోపిన అభియోగాలు రుజువైనట్టయితే యావజ్జీవ కారాగారం లేదా ఉరిశిక్ష విధించే అవకాశముంది. 2016, జులైలో టర్కీలో సైనిక తిరుగుబాటు చెలరేగింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ను గద్దె దించాలని సైనికుల్లోని ఓ వర్గం కుట్ర పన్నింది. ఎర్డోగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో తిరుగుబాటుకు తెరలేపింది. అయితే, ఈ తిరుగుబాటును అణిచివేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఎర్డోగన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడి సందేశంపై స్పందించిన ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి తరలివచ్చి సైనికులను చితకబాదారు. సైనికులకు, టర్కీ పౌరులకు మధ్య చెలరేగిన అల్లర్లలో 250 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైంది. అయితే, ఈ తిరుగుబాటు వెనక అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రవాసముంటున్న గులెన్ హస్తముందని ఎర్డోగన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్డోగన్ను అరెస్ట్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గులెన్ను తమకు అప్పగించాలని ఎర్డోగన్ చేసిన అభ్యర్థలను అమెరికా తోసిపుచ్చింది. టర్కీలో సైనిక తిరుగుబాటు కోసం గులెన్కు సహకరించిన ఆరోపణలపై 1.5లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, పలు వర్సిటీల వీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు అరెస్టయ్యారు.