Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యా నూతన ప్రధానిగా మైఖైల్ మిషుస్తిన్(53) పేరును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం మిషుస్తిన్ ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా కొనసాగుతున్నారు. పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రధాని మెద్వేదేవ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని పుతిన్‌కు మెద్వేదేవ్ సమర్పించారు. మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాత మెద్వెదేవ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇక మెద్వేదేవ్‌తో పాటు తన మంత్రివర్గం రాజీనామా చేసే కంటే ముందు.. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
మెద్వేదేవ్ రాజీనామా నేపథ్యంలో ఆయనను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మెద్వేదేవ్ను పుతిన్ ప్రశంసించారు. మెద్వేదేవ్ దేశం కోసం గొప్ప కృషి చేశారని పుతిన్ కొనియాడారు. 2012 నుంచి రష్యా ప్రధానిగా మెద్వేదేవ్ కొనసాగుతున్నారు. అంతకుముందు 2008 నుంచి 2012 వరకు రష్యా ప్రెసిడెంట్‌గా ఆయన సేవలందించారు. కాగా, ప్రధాని బాధ్యతలు చేపట్టనున్న మిషుస్తిన్ మాస్కోలో జన్మించారు. 1990లలో ఐటీ నిపుణుడిగా పని చేశారు. 1998 నుంచి ట్యాక్స్ సర్వీస్ అధికారిగా సేవలందించారు. ఆ తర్వాత డిప్యూటీ ట్యాక్స్ మినిస్టర్‌గా పని చేశారు. 2008లో రష్యా పెట్టుబడి సంస్థ అయిన యూఎఫ్జీ కంపెనీలో పని చేశారు. 2010 నుంచి రష్యా ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా మిషుస్తిన్ కొనసాగుతున్నారు.
రష్యా మంత్రివర్గం రాజీనామా
రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ మేరకు రష్యాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రష్యా ప్రధాని మెద్వేదేవ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనలు దేశ అధికార సమతుల్యతలో పలు మార్పులను చేస్తాయని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేసింది అన్నారు. మార్పులు చేపట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే అవకాశాన్ని అధ్యక్షుడికి కల్పించాలని అన్నారు. తదుపరి నిర్ణయాలన్నీ అధ్యక్షుడే తీసుకుంటారన్నారు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. ఇందు కోసం సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ పీఎంగా మెద్వేదేవ్ను కొనసాగాలని కోరారు.