Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట విరుద్ధమైనా కొనసాగింపు
వాషింగ్టన్: బానిసత్వం ఎక్కడైనా చట్టవిరుద్ధమే' ఇది వట్టిమాట. ఈ మాటను 40 సంవత్సరాల నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూటీఓ) సహా ప్రతి చోటా ఓ మంత్రంలాగా వల్లె వేస్తున్నారు. బానిసలుగా ఉంచుకోవటం చట్టవిరుద్ధమని ప్రపంచంలో సగం దేశాలు ఇప్పటికీ చట్టం చేయాల్సి ఉన్నది. మనిషిని చట్టపరంగా తన యాజమాన్యంలో ఉంచుకోవటం రద్దు అయినప్పటికీ ఇది నేరం అని మాత్రం చాలా దేశాల్లో గుర్తించటం లేదు. బానిసత్వం, బానిసల వ్యాపారానికి పాల్పడేవారిని చట్టపరంగా శిక్షించేలా 94దేశాలు ఇంకా శిక్షాస్మృతినే రూపొందించుకోలేదు. ఆధునిక బానిసత్వాన్ని 2030లోపు రూపుమాపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధునిక బానిసత్వం అంటే నిర్బంధ పని విధానం, బానిసల విక్రయం, బానిసత్వంలాంటి వ్యవస్థలను కొనసాగిస్తున్న సంస్థలు, దాస్యం లాంటివి.
ట్రాఫికింగ్ వ్యతిరేక చట్టాలు వారి దేశానికే వర్తించేవి 96శాతం దేశాల్లో వున్నాయి. ఇతర రూపాలను అరికట్టే చట్టాలులేవు. ఒక అధ్యయనంలో ఈ క్రింది అంశాలు వెలుగులోకి వచ్చాయి.
- 94దేశాల్లో (49శాతం) బానిసత్వాన్ని నిషేధిస్తూ శిక్షాస్మృతి లేదు.
- 112 దేశాల్లో (58శాతం) నిర్బంధంగా పని చేయించుకుంటే చట్టపర చర్యలు తీసుకునే అవకాశం లేదు.
- 180 దేశాల్లో (93శాతం) పనిచేస్తున్న సమయంలో బానిసత్వ పద్ధతులకు పాల్పడితే నేరం అని నిర్ధారించే చట్టంలేదు.
- 170 దేశాలలో (88శాతం) బానిసత్వంలాంటి పనిపద్ధతులు అమలు జరుగుతున్న సంస్థలను నేరస్తులుగా చూపే చట్టంలేదు.
ఇక సూడాన్ దేశంలో చిన్న వయస్సులో అపహరణకు గురై, చేతులుమారుతూ వచ్చిన యువతి తన అనుభవాలను ఇలా పంచుకున్నది : 'మమ్మల్ని జంతువుల్లా చూస్తారని కొందరు అంటారు. కానీ, నేను ఈ విషయాన్ని అంగీకరించను. ఎందుకంటే.. ఒక జంతువైనా కుక్క, పిల్లిని చాలా ప్రేమగా పెంచుతారు. సకల సౌకర్యాలు కల్పిస్తారు. నాకు అవి ఏవీ అందలేదు'. ఈ మాటలు పరిస్థితికి అద్దంపడుతున్నాయి.