Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్ గేట్స్‌కు చైనా అధ్యక్షులు సి జిన్‌పింగ్ లేఖ
బీజింగ్ : కరోనా వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన తమకు ఆపన్నహస్తం అందించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్ధకు చైనా అధ్యక్షులు సి జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సి జిన్‌పింగ్ శనివారం ఆ సంస్ధకు లేఖ రాసినట్టు స్ధానిక మీడియా తెలిపింది. కష్టకాలంలో తమ దేశానికి మద్దతివ్వడమే కాకుండా, తన ఉదారతను చాటుకున్నదని సి జిన్‌పింగ్ తన లేఖలో పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇటీవల చైనాకు 100 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ''బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నాను. కష్టకాలంలో చైనా ప్రజలకు సంఘీభావం తెలిపినందుకు అభినందిస్తున్నాను'' అని సి జిన్ పింగ్ తన లేఖలో పేర్కొన్నట్టు సిన్హువా వార్తా సంస్ధ పేర్కొంది. మొత్తం దేశాన్ని సమీకరించి వ్యాధిని తగ్గించడానికి, రోగులకు చికిత్స అందించడానికి ఇంతకుముందెన్నడూ లేని స్ధాయిలో చర్యలు తీసుకున్నామని, ఈ చర్యలు గణనీయమైన ఫలితాలను అందిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.