Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కోకిల తన నేస్తమైన పావు రాన్ని వెంట తీసుకొని ఎగురుకుంటూ వెళ్లి ఒక మామిడి చెట్టుపై వాలింది. ఆ చెట్టుకు ఎదురుగా ఒక జామ చెట్టు ఉంది. ఆ చెట్టుకు కొన్ని జామ కాయలు ఉన్నాయి. ఆ చెట్టు తోటమాలి రామయ్యది. అతడు చెట్టుకున్న ఒకే ఒక్క పెద్ద జామ పండును గమనించి ''ఈ పండును నేను తింటాను'' అని అన్నాడు. ఈ మాటలు కోకిల, పావురం విన్నాయి.
ఇంతలో ఒక రామ చిలుక ఆ చెట్టుపైకి ఎగిరి వచ్చి టక్కున ఆ జామ చెట్టు పై వాలింది. అది ఆ పెద్ద జామపండును తినబోయింది. ఇంతలో కోకిల తన పాటను మొదలు పెట్టింది. ఆ పాటకు పరవశం చెందిన ఆ రామచిలుక ఆ పండును తినడం మర్చిపోయి దాని పాటను వినసాగింది. అలా పాడుతూ, పాడుతూ ఆ కోకిల పైకి ఎగిరింది. చిలుక, పావురం దానిని అనుసరించాయి. రామయ్య చిలుక వెళ్లిపోవడం గమనించి వెంటనే ఆ జామ పండును తెంపుకొని తిన్నాడు. అతడు తనకు ఆ పండుతో పాటు మిగతా కొన్ని జామ కాయలు దక్కింపజేసినందుకు ఆ కోకిలతో ''ఓ కోకిలా! నా జామ కాయలు నాకు దక్కునట్లు చేయుటకై నీ పాటను పాడి ఆ చిలుకను ఈ జామపండు తినకుండా నీ వెంబడి ఎటో తీసుకుని వెళ్లావు. నీకు, నీ పాటకు నా కృతజ్ఞతలు'' అని అన్నాడు. అప్పుడే మరలివచ్చిన ఆ కోకిల, పావు రాలు ఆ మాటలను విన్నాయి. పావురం వెంటనే'' చూశావా! కోకిలమ్మా! నీ పాటను ఈ తోటమాలి మెచ్చుకుంటు న్నాడు'' అంది. ఆ మాటలను విన్న కోకిల నవ్వి ''నా పాట ఇతని జామ కాయలను కాపాడిందంటే నాకు, నా పాటకు ఇంతకన్నా గౌరవం ఇంకా ఏం కావాలి'' అని అంది.
అక్కడ నుంచి కోకిల ఆ పావురాన్ని ఒక నది వద్దకు తీసుకొని వెళ్ళింది. అక్కడ కోకిల ఒక రాయి మీద కూర్చొని తన పాటను ప్రారంభించింది. ఆ నదిలోని చేపలు దాని పాటను విని పైకి ఎగురుతూ నృత్యం చేయసాగాయి. ఇంతలో అక్కడకు చేపలను తినడానికి ఒక కొంగల గుంపు వచ్చి వాలింది. వెంటనే కోకిల 'కుహూ, కుహూ' అని పాడేదల్లా 'కొవ కొవ' అని పాడి తన పాటను ఆపివేసింది. ఆ చేపలు ఎగరడం మానివేసి నీటి లోపలికి వెళ్లిపోయాయి. అప్పుడు పావురం కోకిలతో ''ఏమైంది మిత్రమా! నీ పాటను వెంటనే ఆపావు'' అని అడిగింది. ''నేను పాటను ఆపకుంటే ఆ కొంగలు ఈ చేపలను తింటాయి. నా పాట వల్ల ఒకరికి నష్టం జరగకూడదు. అందుకే నేను నా పాటను మార్చి 'కొవ కొవ' అని పాడి నా పాటను మధ్యలోనే ఆపి వేశాను'' అని అంది కోకిల. ఆ మాటలను విని పావురం ''మరి నీ పాటను 'కుహూ కుహూ' అని పాడకుండా 'కొవ కొవ 'అని ఎందుకు మార్చి పాడావు ''అని కోకిలను ప్రశ్నించింది. అప్పుడు కోకిల ' కొ ' అంటే కొంగలు, 'వ' అంటే వచ్చాయి'' అని వాటిని పాట రూపంలో హెచ్చరించానని అంది. ''నీ పాట ఇక్కడ కూడా చేపలకు ఉపకారం చేసింది'' అని అంది పావురం.
అక్కడ నుండి అవి రెండూ ఒక రైతు పొలం వద్దకు వెళ్లాయి.''మిత్రమా! ఆ మబ్బులు వర్షించడానికి నేను నా పాటను పాడతాను. అతని పొలం ఎండిపోతోంది. నేను నా పాటను పాడితే వర్షం కురుస్తుంది'' అని పలికి 'కుహూ కుహూ ' 'కువ, కువ 'అని మొదలు పెట్టింది. దాని పాటకు మబ్బులు మురిసిపోయి వర్షాన్ని కురిపించాయి. ఆ చినుకులు భూమిపైన పడుతూ కోకిల పాట వింటూ తన్మయత్వంతో ప్రవాహంగా మారాయి.
అప్పుడు ఆ పావురం ''నీ పాటను ఎందుకు 'కువ కువ 'అని మార్చి పాడావు మిత్రమా!''అని అడిగింది. అప్పుడు కోకిల బదులిస్తూ 'కు' అంటే కురిపించండి, 'వ' అంటే వర్షం ''అని అర్థం. నా పాట రైతుకు మేలు చేసింది.. పదిమందికి ఉపయోగపడినపుడే మన బ్రతుకుకు సార్థకం. నా పాట అందరికీ మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు'' అని అంది. ఆ వర్షాన్ని చూసి రైతు పులకించి పోయి ''ఓ కోకిలా! నీవు నీ పాటతో వర్షాన్ని కురిపింపచేసి నా పంటను కాపాడావు. నీకు నా ధన్యవాదాలు'' అని అన్నాడు. ''పది మందికి అన్నం పెట్టే ఓ రైతన్నా! నీ కంటే నేనూ, నా పాట గొప్పనా ఏమిటి!'' అని అంది కోకిల. అప్పుడు ఆ రైతు దానికి కృతజ్ఞతలతో నమస్కరించాడు.
ఆ కోకిల మాటలకు ఎంతో సంతోషించిన పావురం ''నీ వల్ల నేను కూడా చాలా విషయాలను తెలుసుకున్నాను. ఇక ముందు నీలాగా నేను కూడా అందరికీ ఉపయోగకరమైన పనులనే చేస్తాను. పరోపకారమే పరమావధిగా భావించే నీవు, నీ యొక్క పాట వల్ల మన పక్షి జాతికే వన్నెను తెచ్చావు. నీకు నా నమస్సులు'' అంటూ పావురం కోకిలకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య , 9908554535