Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగనాయక పురం అనే ఊరిలో రాము, సోము అనే ఇద్దరు ప్రాణస్నేహితులు నివసించేవారు. వీరిద్దరు ఎప్పుడు కలిసి మెలసి ఉండేవారు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవారు. ఒక రోజు వారు గురుకులం నుండి ఇంటికి తిరిగివచ్చే సమయంలో రాము ఇలా అన్నాడు.
''ఈ రోజు మన గురువర్యులు ఒక ప్రశ్న వేసారు గుర్తుందా ?''
''ఏమిటది ?'' సోము అడిగాడు.
''ఈ భూమి మీద ఎవరు గొప్ప ? అని అడిగారు కదా ! దానికి జవాబు మనం ఎలాగైనా తెలుసుకొని చెప్పాలి'' అని ఇద్దరు అనుకుంటూ, మాట్లాడుతూ దారిలో నది తీరాన ఆశ్రమంలో ఉన్న ఒక మహర్షి దగ్గరకు వెళ్ళారు.
''ప్రణామాలు మహర్షి గారు, మాకు ఒక సమస్య వచ్చింది'' అన్నారు ఇద్దరు.
ఏమిటది అని మహర్షి అడుగగా అప్పుడు వారిద్దరు ఇలా అడిగారు ''ఈ భూమి మీద ఎవరు గొప్ప ?''.
అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో వారి ప్రశ్నకు వివరణ చెప్పడం ప్రారంభించాడు. ''భూమి మీద అతి తెలివివంతుడు గొప్పవాడు మనిషే! ఎందుకంటే మనిషి అన్న మాట ఎంతో మహోన్నతమైనది. మనిషి వల్లనే ఈ సమాజం ఏర్పడింది. అందుకు మనిషి ఎంతో గర్వించవచ్చు. కానీ, మనషులు ఎందరో ఉండొచ్చు అందులో మంచి మనుషులు కొందరే ఉంటారు. వారు మాత్రమే నిజమైన మనుషులు. కొందరు చెడ్డమనుషులు కూడా ఉంటారు. కాని ఇలా ఉండడం మంచిది కాదు. ఊసరవెల్లి తన రంగులను సులభంగా మార్చినట్లు, మనిషి తన గుణాలను మారుస్తూనే ఉంటాడు. ఇలా ఒక మనిషి తన అవసరం కోసం తాను ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ పోతుంటే సమాజం కూడా మారుతుంది. ఎలా అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. అదే విధంగా మనిషి మారినప్పుడల్లా సమాజం కూడా మారుతుంది. ఒక మనిషి నుంచి గుణాలు కలిగి ఉంటే సమాజం కూడా మంచిగా మారుతుంది. ఎంతో బాగుంటుంది. కాని మనుషుల్లో మంచి మనుషుల సంఖ్య ఎంత ? చాలా తక్కువ. మనుషులల్లో ప్రకతి గురించి ఆలోచించే వారెవరున్నారు? ప్రస్తుతం మనుషులు ఎలా ఉన్నారంటే తాను తన పిల్లలు, తన కుటుంబం బాగుంటే సరిపోతుందని మాత్రమే ఆలోచించుకుంటున్నారు''.
''ఇలాంటప్పుడు మనిషి గొప్పవాడు ఎలా అవుతాడు'' అమాయకంగా అడిగాడు రాము.
మహర్షి చిరునవ్వుతో కొద్దిసేపు ఆగి మళ్లీ చెప్పడం మొదలెట్టారు.
''మనిషి ఎంత స్వార్థంగా తయారయ్యాడంటే, తనకు దక్కినది మరెవ్వరికీ దక్కకూడదన్నంతగా మారాడు. చివరికి తన పిల్లలకు కూడా దక్కకూడదన్నంతగా. స్వార్ధం వల్ల ఎన్నో కాలుష్యాలు జరుగుతున్నాయి. నీరు, గాలి, భూమి, ఆకాశాలను కూడా కాలుష్యం చేస్తున్నాడు. ఆనాడు మన పూర్వీకులు కూడా మనలా ఆలోచిస్తే ఏమి జరిగుండేదో ఆలోచించండి ? నేడు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా ? అందుకే ఒక మనుసున్నవాడు ప్రకతి ప్రేమికుడిగా మంచివాడిగా బతకాలి. మనకు మన పూర్వీకులు స్వచ్ఛమైన భూమిని, నీరుని మనకి అందించారో అలాగే నేటి ప్రజలు కూడా ముందు తరాలవారికి అందించాలి. మనిషి యొక్క మంచి తనం వల్ల ఒక మనిషి కాదు పక్షులు, జంతువులు, ఈ ప్రకతి కూడా బాగుంటుంది. అలాంటి మంచి మనుషులు ఈ నేలపై చాలా మంది ఉన్నారు. పగలు, రాత్రులు, వెలుగు చీకటి వలే ఈ సష్టిలో మంచి, చెడు రెండు ఉన్నాయి. అవి రెండింటి గురించి ఆలోచించే తెలివితేటలు ఒక మనిషికే ఉన్నాయి.'' అని వివరించాడు.
మహర్షి ద్వారా వారికి సరైన సమాధానం లభించింది.
మరుసటి రోజు వారు గురువు గారితో ''ఈ ప్రపంచం అభివద్ధి చెందాలన్నా, వినాశనం చేయాలన్నా ఒక మనిషి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కనుక ఈ భూమి మీద మనిషే గొప్ప'' అని సమాధానం చెప్పారు. గురువు గారికి సమాధానం నచ్చింది. రాము, సోములను మెచ్చుకున్నారు. అందరూ మంచి మార్గాన్నే అనుసరించాలని శిష్యులందరికీ ఉపదేశించారు.
- మట్టే ప్రసన్న, 9959007914